Jul 03,2022 07:22

అగర్తల : త్రిపురలో అధికార బిజెపి ఆగడాలు యథేశ్చగా కొనసాగుతూనేవున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల అనంతరం బిజెపి ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యాలయాలు, ప్రజాసంఘాల కార్యాలయాలపై దాడులకు తెగబడుతోంది. ప్రధానంగా వామపక్షాల కార్యాకర్తలను లక్ష్యంగా దాడులు చేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోంది. ఈ నేపథ్యంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ నేతృత్వంలోని ఆరుగురు ఎమ్మెల్యేల బృందం గురు, శుక్రవారాల్లో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నరు కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. అనంతరం డిజిపికి కూడా కలిసి తక్షణమే అధికార గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. డిజిపి నుంచి తగిన స్పందన రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా అగర్తలలోని ప్యారడైజ్‌ చౌము హానీ సమీపంలో శనివారం సిపిఎం ఆందోళన చేపట్టింది. అనంతరం జరిగిన బహిరింగ సభలో మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలిపారు. బిజెపి అధికార మదాందకారంతో రెచ్చిపోయి ప్రతిపక్షాల కార్యాకర్తలపైనా, కార్యాల యాలపైనా దాడులకు పాల్పడుతున్నా డిజిపి మొదలుకొని పోలీసు యంత్రాంగం మొత్తం చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ హింసాకాండను ప్రజలే తిప్పికొట్టాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరీ తదితరులు పాల్గొన్నారు.