Jun 02,2023 21:46

ప్రజాశక్తి-చీరాల :కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పురాణాల ఆధారంగా చరిత్రను వక్రీకరించి భారతదేశ లౌకిక స్ఫూర్తిని, ప్రజల ఐక్యతను దెబ్బతీస్తోందని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ప్రోగ్రెసివ్‌ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో చీరాల విద్యాకాలేజీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుండే భారత సమాజాన్ని మతం ఆధారంగా విడగొట్టేందుకు, పాఠ్యాంశాలనూ మార్చేసేందుకు బిజెపి ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. రోమీల థాపర్‌ వంటి చరిత్ర పరిశోధకులు శాస్త్రీయంగా రూపొందించిన పాఠ్యాంశాలను వక్రీకరిస్తోందని అన్నారు. ఈ ధోరణి భవిష్యత్తు తరాలను నిర్వీర్యం చేయనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశంలో ముస్లిములకు, క్రైస్తవులకు, బౌద్ధులకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. భారత సమాజ అభివృద్ధికి తోడ్పడ్డ సామాజిక ఉద్యమకారులైన పెరియార్‌ రామస్వామి వంటి వారి జీవితచరిత్రలను సైతం పాఠ్యాంశాల నుండి తొలగిస్తున్నారని, మానవజాతి అభివృద్ధిలో శాస్త్రీయబద్ధమైన డార్విన్‌ పరిణామ సిద్ధాంతం ప్రపంచ దేశాలన్నీ ఆమోదించిన పాఠ్యాంశాలను పుస్తకాలు నుండి తొలగించడం సైన్స్‌ పరిశోధనలపై మతోన్మాద భావజాలం దాడి చేయడమేనని అన్నారు. సదస్సుకు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రా రామారావు అధ్యక్షత వహించారు. సదస్సులో సిఐటియు రాష్ట్ర నాయకులు వై సిద్ధయ్య, యుటిఎఫ్‌ బాపట్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వినరుకుమార్‌, అడుగుల శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షులు బండి బిక్షాలుబాబు, సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ బాబూరావు, ఎం వసంతరావు పాల్గొన్నారు.