
పాకిస్తాన్ : పాకిస్తాన్‌లో శనివారం ఘోర ఘటన జరిగింది. ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్తాన్ హిమాలయ పర్వత ప్రాంతంలోని ఆస్టోర్ జిల్లాలో షంటర్ టాప్ ప్రాంతంలో హిమపాతం విరుచుకుపడటంతో... 11 మంది మృతి చెందారు. 25 మంది గాయపడ్డారు. గుజ్జర్ కుటుంబానికి చెందిన 25 మంది పీఓకే నుంచి ఆస్టోర్ కు తమ పశువులతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పాకిస్తాన్ ఆర్మీ రెస్క్యూ బృందం చేరుకుంది. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు స్థానిక ప్రజల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. గాయపడినవారిలో 13 మందిని ఆస్టోర్ కు తరలించారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
పాక్ ప్రధాని తీవ్ర విచారం...
ఈ ఘటనలో ప్రాణనష్టంకు సంబంధించి గిల్గిత్-బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి ఖలీద్ ఖుర్షీద్ ఖాన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. సహాయకచర్యలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హిమపాతం దుర్ఘటనపై పాక్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల ప్రభావాల వల్ల పాకిస్తాన్ లో ఇలాంటి సంఘటనలు పెరిగాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి పాకిస్తాన్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను రక్షించడానికి ప్రపంచం మొత్తం తన బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.