Sep 18,2023 09:36

కళా ప్రదర్శన ఏదైనా సరే, అదొక సామూహిక సృజన. నలుగురు కలిసి, సాధన చేసి, సమన్వయంతో వ్యక్తీకరిస్తేనే- అది రక్తి కడుతుంది. ప్రేక్షకులను, శ్రోతలను రంజింపచేస్తుంది. ఆథునిక కళగా అవతరించి, అలరింపజేస్తున్న సినిమా వందల, వేల వ్యక్తుల, చేతుల, ఆలోచనల సృజనాత్మక రూపం. నిర్దేశించుకున్న విభాగాలకు సంబంధించిన కళాకారులు, వృత్తి నిపుణులు ఎవరు లోటు చేసినా - సినిమా నిర్మాణం ముందుకు సాగదు.

55


           తెర వెనక ఎంతమంది ఎన్నెన్ని అహోరాత్రులు పనిచేసినా ప్రేక్షకులకు కనువిందు చేసే పాత్రలను పోషించేది నటీనటులు. అలాంటి ముఖ్య పాత్రధారులు దర్శకుడి సమన్వయంలో ఇమడకపోతే- ఆ సినిమాకు ఏర్పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సినిమాలోని పౌడరు నుంచి పోస్టరు దాకా అయ్యే ప్రతి ఖర్చునూ భరించే నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు అలవి కాకుండా వచ్చి పడతాయి. సినిమా అనే నావను నడిపించే సారథి దర్శకుడు. అగ్రనటులైనా, ఆఫీసు బాయ్ అయినా క్షణక్షణం అతడి సూచనలకు అనుగుణంగా పనిచేస్తేనే - ఆ నావ సకాలంలో థియేటరు అనే తీరానికి చేరుతుంది.

11


         సకాలంలో షూటింగులకు హాజరు కాకపోవడం, సహకరించకపోవడం, తోటి సభ్యులతో గొడవ పడడం వంటి కారణాలతో కొందరు నటులు అప్పుడప్పుడు వార్తలకెక్కుతుంటారు. అదొక ఒరవడిగా మారితే - దర్శక నిర్మాతలకు తీరని నష్టం కలుగుతుంది. ఇలాంటి నటీనటులను తొలుత హెచ్చరించటం, అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే- నిర్మాతలు అందరూ కూడబలుక్కొని నిషేధం విధించటం అప్పుడప్పుడు చిత్ర పరిశ్రమలో జరుగుతుంది. గత వారంలో తమిళ నిర్మాతల మండలి నలుగురు హీరోలపై ఇలాంటి నిషేధం విధించింది. ఒప్పుకున్న సినిమాల నిర్మాణానికి సహకారం అందించటం లేదనేది నిర్మాతల ఫిర్యాదు. విశాల్‌, ధనుష్‌, శింబు, ఆధర్వ నిషేధానికి గురైన నటులు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళలో నటులు సాన్‌ నిగమ్‌, శ్రీనాధ్‌ భాసిపై అక్కడి నిర్మాతల మండలి ఏడాది పాటు నిషేధం విధించింది.

77


          రకరకాల కారణాలతో నటులపై ఇలా నిషేధం విధించటం చాలా కాలంగా వస్తోంది. 2016 నాటి ఉరి, 2019 నాటి పుల్వమా సంఘటనల్లో ఉగ్రవాదుల దాడిలో మన సైనికులు మరణించినప్పుడు - పాకిస్తాన్‌కు చెందిన నటులు, గాయకులపై బాలీవుడ్‌ నిర్మాతల మండలి నిషేధం విధించింది. పాక్‌ నటులు, సాంకేతిక నిపుణులూ భాస్వామ్యం వహించిన డియర్‌ జిందగీ, ఏ దిల్‌ హై సినిమాలను చూడరాదని కొందరు పిలుపునిచ్చినా- సగటు ప్రేక్షకులు సినిమాను సినిమాగానే చూసి, ఆదరించారు.

33


ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఒక కో డైరెక్టరుతో గొడవ పడ్డాడని, షూటింగుకు సరిగ్గా హాజరు కావడం లేదని గతంలో కొద్దికాలం నిషేధం విధించారు. ఆ తరువాత ఆయన అనేక సినిమాల్లో నటించి, ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 'అనామిక' సినిమా ప్రమోషన్లకు హాజరు కాలేదని నయనతార, 'అప్పారావు డ్రైవింగ్‌ స్కూలు' సినిమా షూటింగుకు సరిగ్గా సహకరించలేదని మాళవిక నిర్మాతల నిషేధానికి గురయ్యారు. వేర్వేరు కారణాలతో టాలీవుడ్‌లో నిరోషా, అంకిత, శృతిహాసన్‌ లపై కూడా నిర్మాతల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కొన్నిసార్లు అనధికార నిషేధాలు అమలవుతూ ఉంటాయి. అలాంటప్పుడు నటులు ఒక చిత్రసీమ నుంచి మరొక చిత్రసీమకు మారి పాపులర్‌ అయిన సందర్భాలున్నాయి. ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో కొంతమంది కుట్ర కారణంగా నిర్లక్ష్యానికి గురయ్యాకే హాలీవుడ్‌కి మారినట్టు స్వయంగా ఆమె చెప్పారు.

44


          ఒకనాటి అగ్రనటులు ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, వారికి మద్దతుగా నిలిచే నిర్మాతలూ నటి జమునను దూరంగా పెట్టారనే ప్రచారం ఉంది. ఆమె ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం కొంతమందికి అహంభావంలా అనిపించి, ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడం మానేశారని జమున ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏదేమైనా సరే, సమన్వయంతోనూ, సహకారంతోనూ సాగాల్సిన సినిమా ప్రయాణంలో సర్దుబాట్లు, దిద్దుబాట్లు చాలా అవసరం. కళపైనా, కళాకారులపైనా నిషేధం ఆహ్వానించదగిన పరిణామం అయితే కాదు.