Oct 01,2022 21:30

రుణాలు మరింత ప్రియం
ముంబయి : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును పెంచిన నేపథ్యంలో బ్యాంక్‌లు ఆ భారాన్ని ఖాతాదారులపై నెట్టేస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బిఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తదితర బ్యాంక్‌లు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇది వరకు సాధారణంగా ఆర్‌బిఐ రెపో రేటు పెంచిన తర్వాత బ్యాంక్‌లు కొద్ది రోజుల తర్వాత వడ్డీ రేట్లను పెంచేవి. కాగా.. ఈ దఫా ఆర్‌బిఐ ప్రకటన అనంతరం కొన్ని గంటలకే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి ప్రకటించింది. శనివారం ఇతర బ్యాంక్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
ఆర్‌బిఐ రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.9 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. గడిచిన నాలుగు నెలల్లో నాలుగు సార్లలో 1.90 శాతం పెంచేసింది. దీంతో రుణ వాయిదాలు భారం అవుతున్నాయి. తాజా పెంపు నేపథ్యంలో ఎస్‌బిఐ, బిఒఐ, ఐసిఐసిఐ బ్యాంక్‌, హెచ్‌డిఎఫ్‌సి, ఎల్‌ఐసి హౌజింగ్‌ ఫైనాన్స్‌ తదితర విత్త సంస్థలు తమ ఖాతాదారులకు ఇచ్చిన రుణాలపై వడ్డీ రేటును 0.5 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని బ్యాంకులూ, బ్యాంకింగ్‌యేతర విత్త సంస్థలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. ఎస్‌బిఐ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 8.55 శాతానికి చేర్చింది. బిఒఐ బేస్‌ రేటును 8.75 శాతానికి పెంచింది. ఐసిఐసిఐ బ్యాంక్‌ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 9.60కి చేర్చింది. హెచ్‌డిఎఫ్‌సి వడ్డీ రేటును 0.5 శాతం పెంచి గృహ రుణాలపై కనీస వడ్డీ రేటును ఏడాదికి 8.40 శాతానికి చేర్చింది. ఇంతక్రితం ఈ రేటు 7.90 శాతంగా ఉంది. కాగా పెంచిన వడ్డీ రేట్లు అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి వచ్చాయని అన్ని బ్యాంక్‌లు వాటి ప్రకటనలో స్పష్టం చేశాయి.