Nov 30,2022 09:59

ఆకలి, సంక్షోభం, యుద్ధం వల్ల ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట చస్తామో.. బతుకుతామో అర్థం కాని ఎన్నో కోట్ల బతుకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేల కిలోమీటర్లు నడిచిపోతుంటారు. బిడ్డలనైనా రక్షించుకుందామనుకునే తల్లిదండ్రుల ఆరాటం.. బతుకులు బాగు చేసుకుందామనుకుని ప్రమాదపుటంచుల ప్రయాణాలు చేయడం మనం ఎన్నో చూశాం. అలా పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం ఘనా దేశం నుంచి స్పెయిన్‌కు సహారా ఎడారి గుండా ప్రయాణించింది ఓ వలస బృందం. మానవ అక్రమ రవాణా బృందం చేతిలో దగా పడడం, దాహం తీర్చుకునేందుకు మూత్రం తాగడం, రొట్టెల కోసం ఒకళ్లనొకరు కొట్టుకుని చావడం.. దుర్గంధం వ్యాపించే కుళ్లి కృశించిన మానవ, జంతు కళేబరాల మధ్య సాగింది వారి పయనం. ఇప్పుడెందుకు ఆ వలస బృందం గురించి చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ప్రస్తుతం ప్రపంచ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ఫుట్‌బాల్‌ పోటీల్లో ఘనా, స్పెయిన్‌ దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఫుట్‌ బాల్‌ బృందంలో పాల్గొన్న ఇద్దరు యువకుల మూలాలు ఆ బృందంలోనే ఉన్నాయి. వారిద్దరూ అన్నదమ్ములే.. రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Behind-these-players-is-a-never-ending-hunger-journey


'మనం ఉంటున్న ఈ దేశం మనది కాదు. ఇక్కడికి 5 వేల కిలోమీటర్ల దూరంలో మన సొంత దేశముంది అని ఆ తండ్రి (ఫెలిక్స్‌) పసివాడైన కొడుకుకు చెప్పినప్పుడు 'ఎలా వచ్చావ్‌ నాన్న' అని కొడుకు ప్రశ్నించాడు. 'విమానంలో ఎగిరి వచ్చాను కన్నా' అని ఫెలిక్స్‌ సమాధానం చెప్పాడు. 'కాని నా తల్లిదండ్రులు ఎన్నో విషమ పరిస్థితులను దాటుకుని ఇక్కడికి వచ్చారని తెలుసుకున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వారి ప్రయాణం చాలా విషాదభరితం, భయానకం' అని చెబుతున్నాడు చిన్న కొడుకైన నికో విలియమ్స్‌.
          ప్రేమించి పెళ్లి చేసుకున్న మరియా, ఫెలిక్స్‌ దంపతులు బతుకుదెరువు కోసం ఘనా నుంచి యూరప్‌ వెళ్లాలనుకున్నారు. మొట్టమొదట లండన్‌ చేరుకోవాలనుకున్నారు. ఇంతలో స్నేహితుడొకరు చాలా తక్కువ ఖర్చుతో ఎడారి గుండా స్పెయిన్‌ వెళ్లొచ్చని, అది చాలా సురక్షిత ప్రయాణమని చెప్పడంతో అందుకు సిద్ధమయ్యారు. అయితే ఎంతోమంది వలె ఈ కొత్త జంట కూడా మానవ అక్రమ రవాణాదారుల వలలో చిక్కుకుంది. కొంత దూరం వాహనంలో తీసుకెళ్లిన ట్రాఫికర్ల బృందం వలసదారులను ఎడారి మధ్యలో వదిలేసింది. చేతిలో ఉన్న కాసిన్ని డబ్బులు దోచుకుని 'మీ ప్రయాణం ఇక్కడితో ముగిసింది. ఇక్కడే చావండి' అంటూ వదిలేసింది. దిక్కుతోచని ఆ పరిస్థితిలో వలసదారుల బృందం కాలినడకనే ఎడారి గుండా ప్రయాణించడం మొదలుపెట్టింది.

Behind-these-players-is-a-never-ending-hunger-journey


          ఆ ఎడారిలో నడిచీ నడిచీ ఫెలిక్స్‌ పాదాలు స్పర్శ కూడా కోల్పోయాయి. 40 మంది బృందంతో బయలుదేరిన వారంతా ఆహారం నీరు లేకుండా ప్రయాణించిన రోజులే ఎక్కువ. మూత్రం తాగి దాహం తీర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు, ఆకలి కేకలు, మృత్యుఘంటికలు ఎదురయ్యేవి. ఆకలికి అలమటిస్తూ ఆ బృందంలో ఒక్కొక్కరిగా నేలకొరిగిపోవడం మరియా దంపతులు కళ్లారా చూశారు. మరణించిన తోటివారిని అక్కడే ఖననం చేసేవారు. ఇవన్నీ చూసి 'ఘనా ఎందుకు విడిచిపెట్టామా? అని బాధపడేవాళ్లమ'ని మరియా చెప్పిన విషయాన్ని నికో గుర్తుచేసుకున్నాడు. ఇలా ఎన్నో కష్టనష్టాలు పడుతూ స్పెయిన్‌ సరిహద్దుల్లోకి వెళ్లిన ఆ బృందం మనీలా, మొరాకో సరిహద్దు ఇనుప కంచెను దాటుతున్నప్పుడు వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు.

                                                               ఆపద్బాంధవుడు ఆ న్యాయవాది ..

మనీలాలో అరెస్టయిన అక్రమ వలసదారుల కేసు కోర్టుకు వచ్చింది. అక్కడ ఇదివరకెప్పుడూ చూడని వ్యక్తి న్యాయవాది రూపంలో వారికి తారసపడ్డాడు. అతను ఇచ్చిన సలహా మేరకు తాము లైబిరియా అంతర్యుద్ధ బాధితులమని న్యాయమూర్తి ముందు చెప్పమన్నాడు. దీంతో శరణార్థులమని ముద్ర పడ్డ ఆ బృందం స్పెయిన్‌లోకి అడుగుపెట్టింది. అలా మరియా తమ జీవితంలోకి రాబోతున్న మొదటిబిడ్డ ఇనాక్‌ను కడుపులో మోస్తూ స్పెయిన్‌లోకి అడుగుపెట్టింది.
          ఓ మిషనరీ ఆదరణలో మరియా, ఫెలిక్స్‌ దంపతులు తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బిడ్డల పెంపకం, చదువు, రెండు పూటల తిండి కోసం వారు ఎన్నో తంటాలు పడ్డారు. బాల్యం నుంచీ ఆటలపై ఉన్న శ్రద్ధ ఆ బిడ్డలను ప్రపంచ ఆటగాళ్లుగా నిలిపింది. అలా నికో విలియమ్స్‌, ఇనాక్‌ విలియమ్స్‌ ప్రపంచ ఆటగాళ్లుగా ప్రఖ్యాతి చెందారు కాబట్టి వారి తల్లిదండ్రుల కన్నీటి గాథ ఈ ప్రపంచానికి తెలిసింది. బిడ్డల ఎదుగుదల ఆ తల్లిదండ్రుల జీవిత ప్రయాణాన్ని మన కళ్లముందుంచింది.
         మరి వీరితో పాటు ప్రయాణించిన తక్కిన వారి జీవితాలెలా ఉన్నాయి? అసలు బతికున్నారో లేదో సమాచారం ఉందా? దగాకారుల చేతిలో, వ్యభిచార కూపంలో ఇరుక్కున్న వాళ్లెంతమంది? బిడ్డలను, తోబుట్టువులను పోగొట్టుకున్న వారెంతమంది? భార్య ముందు భర్తను, భర్త ముందు భార్యను అతి కిరాతకంగా హింసించే బృందాలకు చిక్కిందెంతమంది? ఇటువంటి ఎన్నో అంతులేని ప్రశ్నలు మన మెదళ్లను తొలిచేస్తుంటాయి. అందుకే ఫెలిక్స్‌, మరియా విషాద ప్రయాణం.. వారిది మాత్రమే కాదు.. ఎన్నో వలస బతుకుల కన్నీటి వ్యథ.. బతికున్న వాళ్లు.. చనిపోయినవాళ్ల కన్నీటి గుర్తులు..!