Dec 02,2022 08:42
  • ప్రి క్వార్టర్స్‌కు క్రొయేషియా, మొరాకో
  • నేటితో ముగియనున్న గ్రూప్‌ లీగ్‌ పోటీలు

దోహా : 2018 సీజన్‌ ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనలిస్ట్‌ బెల్జియం జట్టు ఈసారి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన గ్రూప్‌-ఎఫ్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో బెల్జియం జట్టు 2018 ఫైనలిస్ట్‌ క్రొయేషియాతో మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుంది. రెండు అర్ధభాగాల సమయం ముగిసే సరికి ఇరుజట్లు గోల్స్‌ చేయడంలో విఫలమ య్యాయి. దీంతో క్రొయేషియా జట్టు 5పాయింట్లతో రెండోస్థానంలో నిలువగా.. బెల్జియం జట్టు 4పాయింట్లతో మూడోస్థానానికే పరిమితమైంది. ఇక ఇదే గ్రూప్‌లో జరిగిన మరో పోటీలో మొరాకో జట్టు 2-1గోల్స్‌ తేడాతో కెనడాను ఓడించి 7పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకి నాకౌట్‌కు అర్హత సాధించింది. మొరాకో తరఫున హకీం 4వ ని.లో, యూసెఫ్‌ 23వ ని.లో ఒక్కో గోల్‌ కొట్టగా.. కెనడా తరఫున ఏకైక గోల్‌ను నయోఫ్‌ కొట్టాడు. 2018లో మొరాకో జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించగా.. ఈసారి నాకౌట్‌కు అర్హత సాధించడం విశేషం. 2018 సీజన్‌లో క్రొయేషియా ఫైనల్‌కు చేరి ఫ్రాన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌ తో సరిపుచ్చుకుంది. 3వ స్థానంలో జరిగిన పోటీలో బెల్జియం ఇంగ్లండ్‌ను 2-0 తో ఓడించింది. నేటి అర్ధరాత్రి జరిగే గ్రూప్‌-జి లీగ్‌ పోటీలతో ఫిఫా ప్రపంచకప్‌ లీగ్‌ దశ పోటీలు ముగియనున్నాయి.
 

                                                       ప్రి క్వార్టర్స్‌కు అర్జెంటీనా, పోలండ్‌

గ్రూప్‌-సినుంచి ప్రి క్వార్టర్స్‌కు అర్జెంటీనా, పోలెండ్‌ జట్లు చేరాయి. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 2-0గోల్స్‌ తేడాతో పోలండ్‌ను ఓడించగా.. మరో మ్యాచ్‌లో మెక్సికో 2-1గోల్స్‌ తేడాతో సౌదీ అరేబియాను చిత్తుచేసింది. మెక్సికో-సౌదీ అరేబియా జట్ల మ్యాచ్‌లో సౌదీ జట్టు గెలిస్తే నేరుగా ప్రి క్వార్టర్స్‌కు చేరేది. కానీ ఆ జట్టు పరాజయం నాకౌట్‌ ఆశలను దెబ్బతీశాయి. ఇక మెక్సికో జట్టు గెలిచినా.. ఆ జట్టు సౌదీకి ఒక గోల్‌ సమర్పించుకోవడంతో ఫలితం తారుమారైంది. దీంతో ఈ గ్రూప్‌ నుంచి పోలండ్‌ జట్టు ఓడినా.. 4పాయింట్ల తో మెక్సికోతో సమంగా నిలిచి ఒక గోల్‌ అంతరంతో రెండోస్థానంలో నిలిచింది.
 

11