Sep 21,2022 16:51

బెంగళూరు : బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాలా? కిలోమీటర్ల మేర గుంతల రోడ్లపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణీకులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలే నిదర్శనం. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నం. ట్రాఫిక్‌ సమస్య వల్ల.. ప్రేమలో పడి.. ఓ ఇంటివాడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఓ వ్యక్తి ఎజిపురా ఫ్లై ఓవర్‌ నిర్మాణం వల్ల ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు. అప్పుడు అతను తన భార్యని సోనీ వరల్డ్‌ సిగల్‌ వద్ద చూశాడట. అప్పటివరకు ఆమె తనకి ఓ స్నేహితురాలిగా మాత్రమే తెలుసట. ఆరోజు ఆమెను తన ఇంటి దగ్గర దింపడానికి బయలు దేరగా మధ్యలో ట్రాఫిక్‌ సమస్య ఎదురై.. షార్ట్‌కట్‌లో మరో మార్గాన్ని ఎంచుకున్నారట. అయితే ఆ రోడ్డంతా గుంతలమయం. పైగా ఆ రోడ్డు ప్రయాణంతో విసుగుతో పాటు విపరీతమైన ఆకలి వేసి.. ఇద్దరూ ఓ రెస్టారెంట్‌కి వెళ్లారట. అక్కడే భోజనం చేస్తూ... ప్రేమలోపడి ఆ తర్వాత మూడేళ్లు డేటింగ్‌లో ఉండి, రెండేళ్లకిందటే వివాహం చేసుకున్నారట. అంటే... వారిద్దరూ ప్రేమించుకుని.. పెళ్లి చేసుకొని ఐదు సంవత్సరాలన్నమాట. అయినా... ఆ ఫ్లైఓవర్‌ మాత్రం ఇంకా నిర్మాణంలోనే ఉందట. ట్రాఫిక్‌ సమస్యలకు.. తన లవ్‌స్టోరీకి ముడిపెట్టి ఓ రెడిట్‌ యూజర్‌ చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు.. తెగ కామెంట్స్‌ చేస్తున్నారు. ట్రాఫిక్‌ కొందరికి చేదు అనుభవాల్నిస్తే.. ఇతనికి మాత్రం మంచి అనుభవాన్నిచ్చిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.