
అమరావతి: తెలంగాణ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారు, తెలుగు జాతి ఎక్కడున్నా.. అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. తెలుగుజాతి కోసం టీడీపీ నిరంతరం శ్రమించిందని గుర్తుచేశారు. తెలుగుజాతి కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని కొనియాడారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి ఎన్టీఆర్ చాటారని తెలిపారు. దేశానికి దశ , దిశ చాటిన నాయకుడు పీవీ నరసింహారావు అని చంద్రబాబు పేర్కొన్నారు. 1991లో దేశ ఆర్థిక సంస్కరణలకు పీవీ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇప్పుడు తెలుగుజాతి పునర్‌నిర్మాణానికి కృషి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సమైక్య రాష్ట్రంలో విజన్ 2020తో అభివృద్ధికి బాటలు వేశామని, ఏపీలో రెండోతరం సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. సంస్కరణలకు సాంకేతికత జోడించామని, సంపద సృష్టించి పేదలకు సంక్షేమ పథకాలు అందించామని చంద్రబాబు తెలిపారు.