
రవీంద్ర గోపాల దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన 'దేశం కోసం భగత్ సింగ్' చిత్రంలోని పాటలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలంటే ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు. అలాంటిది రవీంద్ర గోపాల్ ఈ సినిమాలో ఏకంగా 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు వేశాడు. ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. ఈ సినిమా తన కోసం కాదు.. దేశం కోసం చేసిన సినిమా' అని అన్నారు. ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, 'డబ్బు కోసమే సినిమా తీసే ఈ కాలంలో దేశం కోసం సినిమా చేయడం అభినందించదగ్గ విషయం. నేటి తరానికి గాంధీ, భగత్ సింగ్ అంటే ఎవరో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తే ఎంతో మంది త్యాగఫలం మన స్వాతంత్య్రం అనే విషయం వారికి తెలుస్తుంది' అని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా, ప్రొడ్యూసర్‌గా రవీంద్ర గోపాలకు ఎంతో అనుభవం ఉందని, దేశభక్తి ఉట్టిపడేలా ఇందులో పాటలు ఉన్నాయని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ ఇతర పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదలకానుంది.