Oct 03,2022 21:45

చంఢగీడ్‌ : విశ్వాస పరీక్షలో పంజాబ్‌లోని భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ విశ్వాస తీర్మానాన్ని సెప్టెంబరు 27న ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను స్పీకర్‌ కుల్తార్‌ సింగ్‌ సంధ్‌వాన్‌ సోమవారం ప్రకటించారు. విశ్వాస తీర్మానాన్ని 91 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు సమర్థించారని చెప్పారు. విశ్వాస తీర్మానం, ఇతర సమస్యలపై చర్చించడానికి పంజాబ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలు సోమవారంతో ముగిసాయి. ఎస్‌ఎడికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సభకు హాజరైన ఒక ఎమ్మెల్యే, బిఎస్‌పికి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే కూడా తీర్మానాన్ని వ్యతిరేకించలేదని స్పీకర్‌ తెలిపారు. ఓటింగ్‌ సమయంలో కాంగ్రెస్‌, బిజెపి ఎమ్మెల్యేలతో సహా ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సభకు హాజరు కాలేదని చెప్పారు. పంజాబ్‌ అసెంబ్లీలో స్పీకర్‌తో సహా ఆప్‌కు 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

  • చెరకు ధర పెంపు

చెరకుకు రాష్ట్ర సలహా ధర (ఎస్‌ఎపి)ని పెంచుతున్నట్లు పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌ సోమవారం ప్రకటించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు చివరి రోజున ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ చెరకు ఎస్‌ఎపిని క్వింటాల్‌కు రూ.360 నుంచి రూ.380కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రప్రభుత్వం ఏటా అదనంగా రూ. 200 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని చెప్పారు.