Sep 19,2022 08:22

నేను విశాఖపట్నంలో సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకునిగా పని చేస్తున్నప్పుడు బోయి భీమన్న గారిని, వారి సతీమణిని కలిసి, చాలా విషయాలు చర్చించే అవకాశం వచ్చింది. ఆయన రచించిన పాలేరు నాటకాన్ని కూడా జిల్లా కేంద్రాల్లో, తాలూకా కేంద్రాల్లో ప్రదర్శించే అవకాశం కలిగింది. అటువంటి గొప్ప కవి జయంతిని ఇకపై ప్రతిఏటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించటం ఆనందదాయకం. ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కళాప్రపూర్ణుడు బోయి భీమన్న. సామాజిక చైతన్యాన్ని రగిలించే రచనలు చేసిన కవి. పన్నెండేళ్లకే పద్యం రాశాడు. గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత లాంటి భిన్నమైన సాహితీ ప్రక్రియల్లో 100కి పైగా రచనలు చేశారు. పేదరికం, అంటరానితనం, అవమానాల స్వీయానుభవంతో, తన మీద పడిన ఆ నిందలను భరిస్తూ కీర్తిశిఖరాలను అధిరోహించిన గొప్ప చైతన్యశీలి.
     భారత భాగవత పురాణ జ్ఞానం గల తండ్రి పల్లయ్య వారసత్వం భీమన్నకి కలిసివచ్చింది. గోదావరి జిల్లాల్లో తండ్రి పల్లయ్యకు ఎంతోమంది శిష్యులు వుండేవారు. భీమన్న మామ గారు, నాగరత్నమ్మ తండ్రి గొల్ల చంద్రయ్య ఆ శిష్య బందంలోనివాడే. చంద్రయ్య గారు భీమన్న చురుకుతనం చూసి చదువుకోమని ప్రోత్సహించి కూతురిని ఇచ్చి పెళ్ళిచేసాడు (1936). గొల్ల చంద్రయ్య కూడా అధ్యాపక వృత్తిలో ఉంటూనే దళిత జనోద్ధరణ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. 1936లో రాజోలులో దళిత బాలల విద్యాభివృద్ధి కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేశాడు. కార్మిక సహకార సంఘాల, పరపతి సంఘాల ఏర్పాటులో విస్తృత కృషి చేశాడు. అందువల్ల భీమన్న వ్యక్తిత్వ నిర్మాణంపై ఆయన ప్రభావం ఎంతో ఉంది.
     తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా మామిడికుదురులో 1911 సెప్టెంబర్‌ 19న నాగమ్మ, పుల్లయ్య దంపతులకు భీమన్న జన్మించారు. పాండవుల్లా వీరు అయిదుగురు అన్నదమ్ములు, ఒక ఆడపిల్ల. పుల్లయ్య తన మగపిల్లలకు వరసగా ధర్మరాజు, భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని పేర్లు పెట్టాడు. రెండవ కుమారుడు 'భీమన్న' ఐదో తరగతి విద్యార్థిగా పన్నెండేళ్ల వయసుకే పద్యాలు రాయటం ప్రారంభించినా పరిణత ఆలోచనలతో చేసిన రచనలు మాత్రం 1932 నాటి పల్లెటూరి లేఖలు, 1933 నాటి జానపదుని జాబులు. పట్నంలో కొంతకాలం చదువుకొని పేదరికం వల్ల చదువు కొనసాగించలేక తన స్వగ్రామం వెళ్లి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన యువకుడు తన జీవితానుభవాలను, అనుభూతులన్నింటిని కలగలిపి పట్నంలోని మిత్రుడికి రాసిన ఉత్తరాల రూపంలో వున్న కథనాలే జానపదుని జాబులు. ఆ తరుణం నుంచి 2005 (డిసెంబర్‌ 16)లో తనువు చాలించేవరకు డెబ్బై ఏళ్లకు పైగా ఆయన రాసిన నాటకాలు, కావ్యాలు, ఇతర రచనలు ఎన్నో ఈ సమాజాన్ని, సమాజంలోని సమస్యల్ని ఎలుగెత్తి చాటాయి.
    భీమన్న ఇరవై నాలుగేళ్ల వయసులో (1935) కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో రఘుపతి వెంకటరత్నం నాయుడు అధ్యాపకత్వంలో బిఎ పూర్తి చేసాడు. 1937లో బి.ఇడి చేసాడు. గోరా సాహచర్యం భీమన్న ఆలోచనారీతిని బాగా ప్రభావితం చేసింది. రచనా వ్యాసంగంతో తన ఆలోచనలను, భావోద్వేగాలను ప్రపంచంతో పంచుకోడానికి రచనలు ఒక్కటే మార్గమని భీమన్న నిశ్చయించుకున్నాడు. ప్రముఖ హరిజన నాయకులైన కుసుమ ధర్మన్న గారి పత్రిక 'జయభేరి'లో 1937 నుంచి సహాయ సంపాదకులుగా పనిచేశారు. 1940లో ముమ్మడివరంలో టీచర్‌ ఉద్యోగం వచ్చేవరకూ సాహిత్యంతోనే తన సాంగత్యం కొనసాగించాడు. 1946లో మద్రాస్‌లో ఆంధ్రప్రభ ఉద్యోగానికి వెళ్ళేనాటికి కవిగా, రచయితగా గుర్తింపు పొందాడు. 1953లో గుంటూరు జిల్లా చెరుకుమిల్లి గ్రామ ప్రజలు ఆయనకు గండపెండేరం తొడిగి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి కూడా నామినేట్‌ అయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకొన్నారు.
     భీమన్న రాసిన నాటకాలు, గేయ నాటికలు, పిల్లీ శతకం (1967) వంటి శతకాలు, ఏక పద్యోపాఖ్యానం వంటి వ్యంగ్య రచనలు, రాగోదయం (1954)తో మొదలుపెట్టి మోక్షం నా జన్మ హక్కు (1987) వరకు ఉన్న కావ్యాలు, జీవిత చరిత్రలు, వ్యాసాలన్నీ కలిసి ప్రచురించబడిన రచనలు వందకి పైగానే. పైరుపాట, మానవుని మరొక మజిలీ వంటి గేయ నాటికలూ; బొమ్మ, ఆకాండ తాండవం వంటి గేయకావ్యాలు రాశాడు. కష్టజీవులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కూలిరాజు (1942) నాటకంలో వివరించారు. ఈ నాటకంలో ఆర్థిక సమస్యలతో పాటు కుల సమస్యలను కూడా వివరించారు. 'గుడిసెలు కాలిపోతున్నాయి' పేరిట రాసిన వచన కావ్యం బాగా ప్రసిద్ధి పొందింది. 1973లో రచించిన ఈ కావ్యంలో ఏడాదికోసారి దళితుల గుడిసెలు ఎందుకు కాలిపోతున్నాయి? వాటికి కారణాలు ఏమిటి? వాటి స్థానంలోనే కొత్త గుడిసెలు ఎందుకు వస్తున్నాయో, దళితులు ఆలోచించాలని, ఓట్ల కోసం రాజకీయ నాయకుల్ని నిలదీసే చైతన్యం దళితుల్లో కలగాలనే ఆశయం కనిపిస్తుంది. పాముల్ని కులదోపిడీదారులకు చిహ్నంగా, చీమల్ని శ్రామిక దళితులకు ప్రతీకగా వర్ణించారు. దళితుల మధ్య ఉండవలసిన సమైక్యతను, కలిసిగట్టుదనాన్ని గురించి నొక్కి వక్కాణించారు. మానవత్వం, సాటి మనిషిని గౌరవించడం, సమసమాజ స్థాపన భావన ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా గోచరించేవి. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు తోడ్పడతాయని భీమన్న భావించారు.
       ఆకాశవాణి కోసం ఆయన అనేక భావగీతాల్ని రాశాడు. గుడిసెలు కాలిపోతున్నారు గ్రంథానికి 1975లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ఆయన్ని వరించింది. 2001లో భారత ప్రభుత్వం భీమన్నను పద్మభూషణ్‌ బిరుదుతో సత్కరించింది. అంబేడ్కర్‌ రచనల్ని తెలుగులోకి అనువదించడంతో పాటు, ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని గురించి కీర్తిస్తూ రాశాడు. 'జయ జయ జయ అంబేడ్కర' గీతం ఈనాటికీ ఊరూరా ప్రార్థనా గీతంగా మార్మోగుతోంది. అంబేడ్కర్‌ సిద్ధాంతవాదాన్ని అనుసరించి, ప్రచారం చేశారు.
     భీమన్న రచించిన 'పాలేరు' నాటకం ఆ రోజుల్లో గొప్ప సంచలనాన్ని రేపింది. ఇందులోని కథానాయకుడు వెంకన్న. ఓ కామందు దగ్గర వెట్టి చేస్తూ, నానా బాధలు పడుతుంటాడు. ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని బాగా చదువుకుంటాడు. చివరికి ప్రమోషన్‌ సాధించి, వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలకు అడ్డుకట్ట వేస్తాడు. ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు తమ హక్కులు సాధించుకోవాలనే అంబేడ్కర్‌ ఆశయాన్ని ఈ నాటకం ద్వారా ప్రచారం చేశారు భీమన్న. ఆనాటి దళిత యువకులకు ఈ నాటకం చదువుల బాట పట్టించింది. భీమన్న నాటకాల్లో అత్యంత ప్రత్యేకమైంది 'రాగవాసిష్ఠం'. ఆర్య, అనార్య భేద భావాలు స్థలకాలాలను బట్టి ఏర్పడ్డాయని ఈ నాటకంలో పేర్కొన్నారు. ఈ నాటకాన్ని రాయడానికి భీమన్న వేదాలు, మనుస్మ ృతి, అమరకోశం, రామాయణం, మహాభారతాలను అధ్యయనం చేశారు. భీమన్న మరణానంతరం ప్రముఖ రచయిత్రి అయిన ఆయన సతీమణి బోయి హైమావతి చక్కని కధనాత్మక శైలిలో రాసిన గ్రంధం పాలేరు నుండి పద్మశ్రీ వరకు. ఇది భీమన్న గారి సాహిత్య దృక్పథం, సామాజిక అంశం, కులం, వర్గం మీద ఆయన దృక్పథాన్ని దక్పదాన్ని తెలియజేసే అతి చక్కనైన గ్రంధం. బోయి భీమన్న 111వ జయంతిని పురస్కరించుకుని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా భీమన్న గారి జయంతిని నిర్వహించాలని, ఆయన స్మారకంగా ఒక రెండు లక్షల నగదు పురస్కారంతో ఒక కవిని సత్కరించాలని నిర్ణయించింది.

- రేగుళ్ళ మల్లికార్జునరావు,
సంచాలకులు, భాషా సాంస్క ృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్‌,
94916 59899