Jun 02,2023 12:45

పాట్నా : షోలో పాటలు పాడుతుండగా భోజ్‌పురి ప్రముఖ గాయని నిషా ఉపాధ్యాయపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమెకి బుల్లెట్‌ తగిలి తీవ్రంగా గాయపడినట్లు గురువారం పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... బీహార్‌లోని సరన్‌ జిల్లాలోని సెందూర్వ గ్రామంలో నిర్వహించిన ఓ షోలో నిషా ఉపాధ్యాయ పాటలు పాడుతుండగా ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమెకు ఎడమ తొడపై బుల్లెట్‌ గాయమైంది. వెంటనే అక్కడున్నవారు ఆమెను పాట్నాలోని ఓ ప్రయివేటు ఆసుత్రికి తరలించారు. ప్రస్తుతం నిషా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
కాగా, మంగళవారం జనతా బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కేవలం సోషల్‌ మీడియా ద్వారానే తమకు సమాచారం అందిందని జనతా బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నస్రుద్దీన్‌ ఖాన్‌ మీడియాకు వెల్లడించారు. గాయనిపై జరిగిన ఈ కాల్పుల ఘటనపై బీహార్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ మంత్రి జితేంద్ర కుమార్‌ రారు ఖండించారు. ఈ ఘనటపై జితేంద్ర మీడియాతో మాట్లాడుతూ... 'గాయనిపై జరిపిన నిందితులపై కఠినంగా చర్యలు చేసుకోవాలి. బహిరంగ సభలు, మతపరమైన స్థలాలు, వివాహాలు లేదా ఇతర కార్యక్రమాలో లైసెన్స్‌ పొందిన తుపాకీలతో కాల్పులు జరపడం కూడా చట్టరీత్యా నేరమని ప్రజలు తెలుసుకోవాలి. కాల్పులు క్రిమినల్‌ నేరమని, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ సంఘటన ఎలా జరిగింది. ఆమెపై ఎవరు.. ఎలా కాల్పులు జరిపారు? వంటి విషయాలను పోలీసులు సునిశితంగా పరిశీలిస్తారని నేను అనుకుంటున్నాను.' అని ఆయన అన్నారు. అయితే ఈ ఘటనపై నిషా ఉపాధ్యాయ తల్లిదండ్రులు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు.