
- రెండో ఏడాదీ వెంటాడుతున్న తెగులు
- అధికంగా పురుగుమందుల వినియోగంతో రైతులకు భారీగా పెరిగిన ఖర్చు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : మిర్చి రైతులను ఈ ఏడాదీ తామర తెగులు వెంటాడుతోంది. దీని నివారణకు అధికంగా పురుగు మందులు వాడాల్సి వస్తోంది. దీంతో, రైతులకు ఖర్చు తడిచిమోపెడవుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. గతేడాది 4.58 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 5.54 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అందులో అత్యధికంగా పల్నాడు జిల్లాలో 1.30 లక్షల ఎకరాలు, కర్నూలు జిల్లాలో 1.11 లక్షల ఎకరాలు, ప్రకాశం, అనంతపురం జిల్లాలో 70 వేల ఎకరాల్లో చొప్పున సాగులో ఉంది. గుంటూరు జిల్లాలో 40 వేలు ఎకరాలు, ఎన్‌టిఆర్ జిల్లాలో 45 వేల ఎకరాలు, నంద్యాల జిల్లాలో 45 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో 29 వేల ఎకరాల్లో సాగులో ఉంది. గతేడాది తామర తెగులు వచ్చి ఎక్కువమంది రైతులు నష్టపోయారు. అయినా, ఇతర పంటలకులేని ధరలు మిర్చికి ఉండడంతో ఈ ఏడాదీ మిర్చి సాగు చేపట్టారు. గత రెండేళ్లుగా తెగుళ్లు మిర్చి పంటను ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గత రెండు నెలలుగా నల్ల తామర తెగులు పట్టిపీడిస్తోంది. పంటను కాపాడుకోవడానికి రైతులు అధికంగా పురుగు మందులు వాడుతున్నారు. మిర్చి సాగుకు సహజంగా ఎకరాకు రూ.లక్షకుపై పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అధికంగా పురుగు మందుల వినియోగం వల్ల రైతులకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు అదనపు పెట్టుబడి అవుతోంది. కొంతమంది అవగాహనలేక సింథటిక్ పైరిత్రాయిడ్, నత్రజని మందులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ధరలు ఆశాజనకంగా ఉండడంతో పంటను కాపాడుకోగలిగితే ఎంతోకొంత లాభం పొందొచ్చని ఆశిస్తున్నారు. క్వింటాలుకు సగటు ధర రూ.15 వేల వరకూ ఉండడంతో పెట్టుబడి అయినా వస్తుందని ఆశతో ఎక్కువమంది రైతులు ఉన్నారు. తెగుళ్ల నివారణలో వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు రైతులను చైతన్యవంతం చేయలేకపోతున్నారు. తెగుళ్ల నివారణకు ఆకర్షణ పైర్లుగా ఆముదం, బంతి మొక్కలు చేలలో వేసుకోవాలని మాత్రమే సూచిస్తున్నారు. విచక్షణారహితంగా పురుగు మందులు వాడకుండా బంతి, ఆముదం సాగు చేస్తూ పంట మార్పిడి విధానం పాటించాలని అధికారులు చెబుతున్నారు.