Jun 30,2022 11:52

డాకర్‌ : ఆఫ్రికా దేశం సెనెగల్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో ఐరోపాకు వెళుతున్న బోటు దక్షిణ కాసామాన్స్‌ ప్రాంతంలోని కఫౌంటైన్‌ సమీపంలో సముద్రంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 13 మంది మఅతి చెందినట్టు రెడ్‌ క్రాస్‌ అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఈ బోటులో మంటలు వ్యాపించడం వల్లే బోల్తా పడి ఈ దుర్ఘటన జరిగినట్టు స్థానిక వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.

                                                              40మంది గల్లంతు..

సిబ్బంది మాట్లాడుతూ ... ప్రమాద సమయంలో బోటులో దాదాపు 150 మందికి పైగా ఉన్నారని, వీరిలో 91మందిని కాపాడామని తెలిపారు. మరో 40మందికి పైగా గల్లంతయ్యారని, సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. గల్లంతయినవారి ఆచూకీ కోసం తామంతా గాలిస్తున్నామన్నారు. అసలు ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలేంటి ? ఈ బోటుకు, మైగ్రేషన్‌ ఆపరేషన్‌కు ఇన్‌ఛార్జి ఎవరు ? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

                                        ప్రమాదకర సముద్ర మార్గం.. గతంలోనూ దుర్ఘటన..

పశ్చిమ ఆఫ్రికా తీర ప్రాంతం వెంబడి ఈ ప్రమాదకరమైన సముద్ర మార్గంలో చిన్న పడవల్ని తీసుకొని ఏటా చాలామంది ఐరోపా వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. గతేడాది ఆగస్టులో కూడా 60మందితో వెళ్తున్న ఓ బోటు సెనెగల్‌కు ఉత్తరాన ఉన్న సెయింట్‌ లూయిస్‌ వద్ద బోల్తా పడగా.. వీరిలో అనేకమంది సముద్రంలో మునిగిపోయారు.