Jun 27,2022 07:41

శభాష్‌ ప్రియా..!
నీ తృష్ణ లీలలు బహు విచిత్రం..
లాభాలన్నీ గుణించుకున్నాక మాత్రమే
ఆచి తూచి మరీ నన్ను ప్రేమిస్తావు...
లెక్క ప్రకారం
ఒక్క కొంటె చూపు విసిరి
కోటి సుఖాలను మూటగట్టుకోవాలని
తహతహలాడతావు..
నువ్వెప్పుడూ ఇంతే ప్రియా...!
ఇవ్వడం కంటే
తిరిగి పొందటం పైనే
దృష్టినంతా కేంద్రీకరిస్తావు ..
నారింజ పండు లాంటి
నవ్వుతో కన్ను గీటి
అందరినీ తిమ్మిరెక్కిస్తావు..
కత్తితో పొడుస్తూనే
హఠాత్తుగా గౌరవాన్ని కుమ్మరించి
గాఢంగా కౌగిలించుకుంటావు...
తనువంతా గాయాలను రగిలిస్తూనే
ఒక బలహీన క్షణంలో
నన్ను నీ శయనపీఠం పైకి
అమాంతం లాక్కుంటావు
ఆ మోహాంధకారం లో
నేను కూడా ఉక్కిరిబిక్కిరయి
ఉనికినే జారవిడుచుకుంటాను..
ఎంతటి మాయల మరాఠివే ప్రియా..!
చేయవలసిందంతా చేసి
ఉన్నఫళంగా ప్రేమను ఒలకబోసి
ఉద్ధారకురాలిగా ఫోజు కొడతావు..
తల మీద కిరీటం అలంకరించి
మొల మీద బట్టలూడదీస్తావు
ఎన్నికలల వలపులతో.. ఊరిస్తావో కదా !
నువ్వొక్కదానివే కాదులే ప్రియా...!
అవసరమైనప్పుడల్లా చాలా మంది
ఇలాంటి కిలికించితాలనే చిలకరించి
నన్ను మైమరపిస్తారు..
నీలాగే ఎందరో...
బూత్‌తంత్రంతోనే ముమ్మాటికి
నా మూతిని చుంబిస్తారు !

- కోయి కోటేశ్వరరావు
94404 80274