Oct 02,2022 21:08

రియో డి జనీరో : ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా పేరున్న బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. వామపక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షులు లూయిజ్‌ ఇనాసియో లులా డి సిల్వా మరోసారి అధికారంలోకి వస్తారని ఒపియన్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓటింగ్‌లో పాల్గన్నారు. సుమారు 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే అధ్యక్ష ఎన్నికలతో పాటు 26 రాష్ట్రాలకు, ఒక ఫెడరల్‌ జిల్లాకు రాష్ట్ర గవర్నర్లు, సెనెటర్లు, ఫెడరల్‌, స్టేట్‌ డిప్యూటీలకు కూడా ఎన్నికలు జరిగాయి. సావో పౌలో రాష్ట్రంలో 76 ఏళ్ల లులా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా పోటీ ప్రధానంగా ప్రసుత్త అధ్యక్షులు జైర్‌ బోల్సోనారో, మాజీ అధ్యక్షులు లూయిజ్‌ ఇనాసియో లులా డి సిల్వా మధ్య మాత్రమే ఉంది. బోల్సోనారో తన అధ్యక్ష పదవిని నిలుబెట్టుకుంటారో, లేకపోతే లులా మళ్లీ మరోసారి అధికారంలోకి వస్తారో ఈ ఎన్నికలు తేల్చి చెప్పనున్నాయి. బ్రెజిల్‌ కాలమానం ప్రకారం సాయంత్రానికి ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే బ్రెజిల్‌ ఎన్నికల విధానం ప్రకారం విజేతగా ఎన్నికైన అభ్యర్థి కనీసం 50 శాతానికి పైగా ఓట్లను పొందాల్సి ఉంది. లేకపోతే ముందంజలో ఉన్న ఇద్దరి అభ్యర్థుల మధ్య రెండో దశ ఎన్నికలను ఈ నెల 30న నిర్వహిస్తారు. అయితే ఈ ఎన్నికల్లో లులా విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. లులాకు 50 శాతానికి ఓట్లు వస్తాయని తాజాగా శనివారం వెల్లడించిన డేటాఫోల్హా సర్వే కూడా తెలిపింది. బోల్సోనారోకు 36 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. బోల్సోనారో పరిపాలనపై అనేక విమర్శలు వున్నాయి. బోల్సోనారో పదవీ వ్యామోహం, కోవిడ్‌ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం, అమెజాన్‌ వర్షపాత అడవులను గత 15 ఏళ్లలో ఘోరంగా నిర్మూలించడం వంటి అంశాలు అతనిపై వ్యతిరేకతకు కారణంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోవడంతో 3 కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడ్డారని సర్వేలు చెబుతున్నాయి. దీంతో వామపక్ష అభ్యర్థి లూయిజ్‌ ఇనాసియో లులా డి సిల్వా మరోసారి అధికారంలోకి వస్తారని సర్వేలు అంచనా వేస్తున్నాయి. పేదలు, మహిళలు, మైనార్టీలు లులాకు అండగా ఉన్నారని చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో వామపక్ష అభ్యర్థులు అధ్యక్షలుగా ఎన్నికయ్యారు. కొలంబియాలో గుస్తావో పెట్రో, చీలీలో గార్బియల్‌ బోరిక్‌, పెరూలో పెడ్రూ కాస్టిల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలోనే బ్రెజిల్‌లోని లులా చేరుతారని ఒపియన్‌ పోల్స్‌ నమ్మకంగా చెబుతున్నాయి. ఈ విషయాన్ని బోల్సోనారో పరోక్షంగా ఇప్పటికే అంగీకరిస్తున్నారు. పదే పదే ఇవిఎంలపై విమర్శలు చేస్తున్నారు. వాటి విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. అలాగే తొలి దశ ఓటింగ్‌లో తాను విజయం సాధించికపోతే ఏదో 'అసాధారణం' జరిగిందని భావించాల్సి ఉంటుందని సెప్టెంబర్‌ 18నే బోల్సోనారో చెప్పారు.