Mar 22,2023 07:38

గత మూడేళ్లలో మార్కెట్లో స్వల్పకాలిక కొనుగోళ్లను కూడా చేర్చి పీక్‌ డిమాండ్‌ ఆధారంగా ఐఎస్‌టిఎస్‌ చార్జీలు వర్తించే సామర్థ్యాన్ని సిఇఆర్‌సి తాజా ఉత్తర్వు ప్రకారం లెక్కగడుతున్నారు. అంటే, వినియోగించని ప్రసార సామర్థ్యాన్ని కూడా వినియోగించినట్లుగా పరిగణించి డీమ్డ్‌ జిఎన్‌ఎ సామర్థ్యాన్ని లెక్కగడుతున్నారు. దీంతో ఎ.పి డిస్కంలకు 1750 మె.వా గా ఉన్న ఎల్‌టిఎ సామర్థ్యం 4516 మె.వా డీమ్డ్‌ జిఎన్‌ఎ సామర్థ్యాంగా పిజిసిఐఎల్‌ లెక్కగట్టి అధిక చార్జీలను వసూలు చేస్తున్నది. ఎ.పి డిస్కంలు ఈ విధంగా చెల్లించాల్సిన ఐఎస్‌టిఎస్‌ చార్జీలు నెలకు రూ.130 కోట్లకు పెరిగాయి.

విద్యుత్‌ రంగంలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను రాష్ట్రాలపై రుద్దేందుకు కేంద్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (సిఇఆర్‌సి) ఒక ఉపకరణంగా మారింది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, ఆదేశాలకు అనుగుణంగా సిఇఆర్‌సి ఉత్తర్వులు, రెగ్యులేషన్లు జారీ చేస్తుంది. వాటిని రాష్ట్రాల విద్యుత్‌ నియంత్రణ కమిషన్లు అనుసరిస్తున్నాయి. కేంద్ర విద్యుత్‌ సంస్థలు, అంతర్‌ రాష్ట్ర విక్రయాలు చేసే విద్యుత్‌ సంస్థలు సిఇఆర్‌సి నియంత్రణ పరిధిలో ఉండటం ఇందుకు మార్గాన్ని సుగమం చేస్తున్నది. ఒక రాష్ట్రానికి చెందిన డిస్కంలు కేంద్ర విద్యుత్‌ సంస్థల నుండి, రాష్ట్రం బయట నుండి మార్కెట్లో, విద్యుత్‌ ఎక్చ్సేంజ్‌ల ద్వారా, ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసే విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కేంద్ర విద్యుత్‌ ప్రసార సంస్థ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పిజిసిఐఎల్‌) ప్రసార వ్యవస్థను వినియోగించుకోవాలి. ఇందుకు చెల్లించాల్సిన ప్రసార చార్జీలను సిఇఆర్‌సి నిర్ణయిస్తుంది. అంతర్‌ రాష్ట్ర విద్యుత్‌ ప్రసారానికి చెల్లించాల్సిన చార్జీలను (ఐఎస్‌టిఎస్‌) చాలా అన్యాయంగా సిఇఆర్‌సి పెంచుతున్నది.
        గతంలో ఉన్న సిఇఆర్‌సి రెగ్యులేషన్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలు కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి స్టేషన్ల నుంచి పిజిసిఐఎల్‌ ప్రసార వ్యవస్థను వాడుకుంటున్న సెంబ్‌ కార్ప్‌ వంటి ప్రైవేట్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల నుండి సరఫరా జరుగుతున్న విద్యుత్‌కు వర్తించే టాన్స్‌మిషన్‌ చార్జీలకు దీర్ఘకాలిక యాక్సెస్‌ (ఎల్‌టిఎ) సామర్ధ్యం 1750 మెగావాట్లు (మె.వా) ఉండేది. 2022-23 ప్రథమార్థంలో ఈ సామర్థ్యానికి ఎ.పి డిస్కంలు నెలకు దాదాపు రూ. 87 కోట్ల చొప్పున ఐఎస్‌టిఎస్‌ చార్జీలను చెల్లిస్తూ వచ్చాయి. పశ్చిమ ప్రాంతంలోని రారుగఢ్‌ నుండి దక్షిణ ప్రాంతంలోని పుగులూరు వరకు పిజిసిఐఎల్‌ కొత్తగా నెలకొల్పిన 800 కెవి హెచ్‌విడిసి లైన్‌ గత సెప్టెంబరు నుంచి వాణిజ్యపరంగా పని చేస్తున్నది. ఈ కొత్త హెచ్‌విడిసి లైన్‌ సామర్థ్యం వినియోగంతో నిమిత్తం లేకుండా చార్జీలను ఆ ప్రాంత రాష్ట్రాల డిస్కంలపై మోపుతూ సిఇఆర్‌సి ఇచ్చిన ఉత్తర్వులతో నెలకు రూ.15 కోట్ల అదనపు భారం ఎ.పి డిస్కంలపై పడింది.
        గత అక్టోబరు 15 నుండి అమలులోకి వచ్చే విధంగా సిఇఆర్‌సి అంతర్‌ రాష్ట్ర ప్రసార వ్యవస్థకు కనెక్టివిటీ అండ్‌ జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సిస్‌ రెగ్యులేషన్లను జారీ చేసింది. దీని ప్రకారం ఐఎస్‌టిఎస్‌ చార్జీల వర్తింపు ఎల్‌టిఎ నుండి జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ (జిఎన్‌ఎ)కు మారింది. గత మూడేళ్లలో మార్కెట్లో స్వల్పకాలిక కొనుగోళ్లను కూడా చేర్చి పీక్‌ డిమాండ్‌ ఆధారంగా ఐఎస్‌టిఎస్‌ చార్జీలు వర్తించే సామర్థ్యాన్ని సిఇఆర్‌సి తాజా ఉత్తర్వు ప్రకారం లెక్కగడుతున్నారు. అంటే, వినియోగించని ప్రసార సామర్థ్యాన్ని కూడా వినియోగించినట్లుగా పరిగణించి డీమ్డ్‌ జిఎన్‌ఎ సామర్థ్యాన్ని లెక్కగడుతున్నారు. దీంతో ఎ.పి డిస్కంలకు 1750 మె.వా గా ఉన్న ఎల్‌టిఎ సామర్థ్యం 4516 మె.వా డీమ్డ్‌ జిఎన్‌ఎ సామర్థ్యాంగా పిజిసిఐఎల్‌ లెక్కగట్టి అధిక చార్జీలను వసూలు చేస్తున్నది. ఎ.పి డిస్కంలు ఈ విధంగా చెల్లించాల్సిన ఐఎస్‌టిఎస్‌ చార్జీలు నెలకు రూ.130 కోట్లకు పెరిగాయి.
        మూడు ఎ.పి డిస్కంలు 2022-23లో రూ.1288.26 కోట్ల మేరకు ఐఎస్‌టిఎస్‌ చార్జీలను పిజిసిఐఎల్‌కు చెల్లిస్తుండగా, 2023-24లో ఇవి రూ.1698.54 కోట్లకు పెరగనున్నట్లు అంచనా చూపాయి. ఈ పెరుగుదల 31.84 శాతం. అయితే, జిఎన్‌ఎ రెగ్యులేషన్లు అమలు లోకి రాక ముందు ఎ.పి డిస్కంలు నెలకు చెల్లించిన రూ.87 కోట్లతో పోల్చితే, జిఎన్‌ఎ రెగ్యులేషన్ల కింద నెలకు చెల్లించాల్సిన మొత్తం రూ.130 కోట్లు. పెరుగుదల శాతం 49.42. అంటే, ఇష్టారాజ్యంగా చేస్తున్న మార్పుల వల్ల ఒక్క సంవత్సరంలోనే ఐఎస్‌టిఎస్‌ చార్జీల భారం ఇంత అధికంగా ఎ.పి డిస్కంలపై పెరిగింది. ఈ అదనపు భారాలు డిస్కంల వినియోగదారులపై చార్జీల రూపంలో పడుతున్నాయి.
        వాస్తవానికి ప్రస్తుతమున్న కేంద్ర విద్యుత్‌ స్టేషన్ల నుండి ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా కేటాయించిన 6.4 మె.వా తప్ప, కొత్తగా ఐఎస్‌టిఎస్‌ సామర్థ్యం పెరగలేదు. సల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్లు వాటి స్వభావం రీత్యా తాత్కాలికమైనవి. ఆ మేరకు విద్యుత్‌ ప్రసారం చేయడానికి పిజిసిఐఎల్‌ ప్రసార సామర్థ్యాన్ని చేర్చలేదు. అందువల్ల గత మూడేళ్లలో డిస్కంలు చేసిన స్వల్పకాలిక కొనుగోళ్లను బట్టి ఐఎస్‌టిఎస్‌ చార్జీలు వర్తించే సామర్థ్యాన్ని లెక్కగట్టటం నిర్హేతుకం. ఎల్‌టిఎ విధానానికి విరుద్ధం. పైగా 2023-24 సంవత్సరానికి ఎ.పి డిస్కంలు మార్కెట్‌ కొనుగోళ్లు చేయాల్సిన అవసరం ఏమీ చూపలేదు. డిస్కంలు మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితికి కేటాయించిన మేరకు బొగ్గు, సహజ వాయువు వంటి ఇంధనాలను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం. డిస్కంలపై మోపుతున్న ఆర్‌పిపిఒ కొనుగోళ్లు మరో కారణం. అవసరంలేని ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచి అవసరం లేని రాష్ట్రాల డిస్కంలపై ఐఎస్‌టిఎస్‌ చార్జీలను మోపటం ప్రశ్నార్థకం. మార్కెట్‌లో డిస్కంలు కొనుగోలు చేసిన మేరకే ఐఎస్‌టిఎస్‌ చార్జీలను నిర్ణయించటం న్యాయం. అది కూడా, డిస్కంలు కాంట్రాక్టు చేసిన సామర్థ్యాన్ని సంబంధిత స్టేషన్ల నుండి విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా జరగక వాడుకోకపోతే, ఆ సామర్థ్యానికి చెల్లిస్తున్న చార్జీల నుంచి స్వల్పకాలిక కొనుగోళ్ల సామర్థ్యానికి చార్జీలను సర్దుబాటు చేయాలి. డీమ్డ్‌ జిఎన్‌ఎ రెగ్యులేషన్ల అన్యాయాన్ని ప్రశ్నిస్తూ దక్షిణాది రాష్ట్రాల డిస్కంల తరఫున దాఖలు చేసిన పిటిషన్‌ను సిఇఆర్‌సి నిర్హేతుకంగా తోసిపుచ్చింది.
         నియంత్రణ ప్రక్రియ అన్యాయంగా భారాలు మోపే మొక్కుబడి ప్రక్రియగా తయారయ్యింది. పిజిసిఐఎల్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను దేశవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు గనుక, అదనంగా చేర్చిన లైన్‌ను జాతీయ స్థాయిలో చార్జీలు వర్తించే విధంగా పరిగణించాలన్న దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థనను కూడా సిఇఆర్‌సి పట్టించుకోలేదు. దానిపై అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎపిటిఇఎల్‌)లో దాఖలు చేసిన అప్పీల్‌ పెండింగ్‌లో ఉంది. అవసరంతో నిమిత్తం లేకుండా విచక్షణారహితంగా ట్రాన్స్‌మిషన్‌ సామర్థ్యాన్ని పిజిసిఐఎల్‌ పెంచకూడదు. రాష్ట్రాల డిస్కంలు కాంట్రాక్టు చేయని ట్రాన్స్‌మిషన్‌ సామర్థ్యానికి పిజిసిఐఎల్‌ చార్జీలను వసూలు చేయరాదు. అవసరంతో పొంతన లేకుండా ప్రసార సామర్థ్యాన్ని అధికంగా చేరిస్తే, అదనపు సామర్థ్యం నిరుపయోగంగా ఉండి, రాష్ట్రాలపై భారాలు పెరుగుతున్నాయని దేశంలో విద్యుత్‌ నియంత్రణ కమిషన్ల ప్రతినిధులతో ఏర్పాటైన ఫోరమ్‌ ఫర్‌ రెగ్యులేటర్స్‌ (ఎఫ్‌.ఒ.ఆర్‌) తన నివేదికలో తప్పుపట్టింది. ట్రాన్స్‌మిషన్‌ సామర్థ్యం ఏర్పాటు ప్రణాళికాబద్ధంగా ఉండాలని పేర్కొంది. ఎఫ్‌.ఒ.ఆర్‌ లో భాగస్వామి అయిన సిఇఆర్‌సి వీటిని పట్టించుకోలేదు. పిజిసిఐఎల్‌ అనవసర సామర్థ్యాన్ని చేర్చటాన్ని కూడా ప్రశ్నించలేదు. సెప్టెంబర్‌ 2025 వరకు నెలకొల్పే సౌర విద్యుత్‌ యూనిట్లకు కేంద్రం ఐఎస్‌టిఎస్‌ చార్జీల నుండి 25 ఏళ్లపాటు మినహాయింపు ఇచ్చింది. అయితే, ఆ చార్జీలను మోడీ ప్రభుత్వం పిజిసిఐఎల్‌కు చెల్లించటం లేదు. డీమ్డ్‌ జిఎన్‌ఎ సామర్థ్యం పేరుతో మినహాయింపు చార్జీలను కూడా రాష్ట్రాల డిస్కంలపై సిఇఆర్‌సి మోపింది. అదానీ, టాటా ఇతర పెట్టుబడిదారీ సంస్థలు ఇతర రాష్ట్రాలలో నెలకొల్పుతున్న సౌరవిద్యుత్‌ ప్రాజెక్టుల నుండి సెకీ, ఎన్‌వివిఎన్‌ఎల్‌ వంటి కేంద్ర వ్యాపార సంస్థలు ఇతర రాష్ట్రాల డిస్కంలకు సరఫరా చేసే విద్యుత్‌ ధరలు తక్కువగా ఉన్నట్లు చూపడానికి ఆయా గుత్త పెట్టుబడిదారీ సంస్థల ప్రాజెక్టుల నుండి విద్యుత్‌ కొనుగోలుకు వీలు కల్పించటానికి మోడీ ప్రభుత్వం ఈ మినహాయింపు ఇచ్చింది.
        ఆశ్రిత పెట్టుబడిదారుల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను అమలు చేయటంలో ఆలస్యం జరుగుతున్న దృష్ట్యా ఐఎస్‌టిఎస్‌ చార్జీల మినహాయింపుకు వాటిని నెలకొల్పాల్సిన గడువును కూడా మోడీ ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. కానీ, ఆచరణలో ఆ మినహాయింపు మొత్తాన్ని కూడా జిఎన్‌ఎ సామర్థ్యం పేరుతో డిస్కంల వినియోగదారులపైనే మోపుతున్నది. సౌర విద్యుత్‌ వినియోగాన్ని ప్రొత్సహించేందుకే ఈ మినహాయింపు ఇచ్చినట్లయితే, ఒక రాష్ట్రంలో నెలకొల్పి, ఆ రాష్ట్ర డిస్కంలకు వినియోగదారులకు సరఫరా చేసేందుకయ్యే ట్రాన్స్‌మిషన్‌ చార్జీలకు కూడా మోడీ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చి ఉండాలి.
ఆ మినహాయింపు మొత్తాలను సంబంధిత రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ సంస్థకు కేంద్రం చెల్లించాలి. కానీ, మోడీ ప్రభుత్వం అలా చేయడం లేదు. సిఇఆర్‌సి కూడా ఆ మినహాయింపు మొత్తాలను పిజిసిఐఎల్‌ కేంద్ర ప్రభుత్వం నుండి పొందాలని తన ఉత్తర్వులు రెగ్యులేషన్లలో నిర్దేశించకుండా దాటవేస్తున్నది. ఆ విధంగా మినహాయింపు ఇస్తున్నట్లు పైకి ప్రచారం చేసుకొంటూ, ఆచరణలో మినహాయింపు మొత్తాలను కూడా వినియోగదారులపై మోపే టక్కరి వ్యవహారం నడుస్తున్నది. వాస్తవానికి తనంతట తాను అలాంటి మినహాయింపు ఇచ్చే అధికారం సిఇఆర్‌సికి, రాష్ట్రాల ఇఆర్‌సిలకు చట్టప్రకారం లేదు.
        ఆర్‌ఇ ఉత్పత్తి స్టేషన్లకు రెన్యువబుల్‌ హైబ్రిడ్‌ జనరేటింగ్‌ స్టేషన్లు (సౌర, పవన విద్యుత్‌ను మిశ్రమ ఉత్పత్తి చేసే స్టేషన్లు), పంప్డ్‌ జల విద్యుత్‌ స్టేషన్లు, వాటి విద్యుత్‌ను వినియోగించేందుకు బ్యాటరీ స్టోరేజ్‌ సిస్టమ్‌లను వినియోగించే స్టేషన్లకు ఐఎస్‌టిఎస్‌ చార్జీల నుండి మినహాయింపు ఇస్తూ కేంద్రం విధానాల ప్రకారం సిఇఆర్‌సి తాజాగా రెగ్యులేషన్‌ను జారీచేసింది. రెగ్యులేషన్‌లో పేర్కొన్న షరతులకు లోబడి 2025 జూన్‌ 30 లోగా నెలకొల్పే పైన పేర్కొన్న ప్రాజెక్టులకు 12 నుండి 25 ఏళ్లపాటు ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొంది.
       ఇక్కడ కూడా ఆ మినహాయింపు చార్జీలను కేంద్రం సంబంధిత ట్రాన్స్‌మిషన్‌ సంస్థకు చెల్లించాలని పేర్కొనకుండా సిఇఆర్‌సి యథావిధిగా దాటవేసింది. అదానీ, ఇతర పెట్టుబడిదారీ సంస్థలు ఈ విధమైన ప్రాజెక్టులను నెలకొల్పుతున్న నేపథ్యంలో ఈ రెగ్యులేషన్లు జారీ అయ్యాయి. యూనిట్‌కు రూ.90 వరకు అమ్ముకునేందుకు అనుమతించాలని కోరుతూ ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై, యూనిట్‌కు రూ.50 వరకు ఎక్స్చేంజ్‌ ద్వారా విద్యుత్‌ను అమ్ముకునేందుకు అనుమతిస్తూ సిఇఆర్‌సి ఫిబ్రవరి 16న ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్‌ డే అహెడ్‌ మార్కెట్‌ (ఐడిఎఎమ్‌), రియల్‌ టైమ్‌ మార్కెట్‌ (ఆర్‌టిఎం), టర్మ్‌ అహెడ్‌ మార్కెట్‌ (టిఎఎం), గ్రీన్‌ టర్మ్‌ అహెడ్‌ మార్కెట్‌ (జిటిఎఎం) వంటి విధానాలతో ఎక్స్చేంజ్‌ల ద్వారా విద్యుత్‌ విక్రయాలకు సిఇఆర్‌సి ఉత్తర్వులు వీలు కల్పించాయి. యూనిట్‌కు రూ.50 వరకు అమ్ముకునేందుకు హై ప్రైస్‌ డే అహెడ్‌ మార్కెట్‌ (ఎచ్‌పి-డిఎఎం) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కూడా సిఇఆర్‌సి తాజా ఉత్తర్వులో ఐఇఎక్స్‌కు అనుమతి ఇచ్చింది. ఇది విధానపరమైన రెగ్యులేటరీ అరాచకత్వానికి పరాకాష్ట. ఈ ఏర్పాటులో ఇమిడి ఉన్న అత్యంత ప్రమాదకరమైన అంశం యూనిట్‌కు రూ.50 వరకు చెల్లించి డిస్కంలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు అనేది. అలాంటి పరిస్థితిని మోడీ ప్రభుత్వం సృష్టించనున్నదా? లేక ఏదైనా డొంక తిరుగుడు పద్ధతిలో ఈ అధిక ధర విద్యుత్‌ను డిస్కంలపై రుద్దుతారా? ఆచరణలో ఏం జరుగుతుందనేది చూడాలి..!

(వ్యాసకర్త విద్యుత్‌ రంగ నిపుణులు,
సెల్‌ : 9441193749)
ఎం. వేణుగోపాలరావు

ఎం. వేణుగోపాలరావు