Mar 17,2023 09:36

'లుంగీ డ్యాన్స్‌.. లుంగీ డ్యాన్స్‌' అంటూ సాగే బాలీవుడ్‌ చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' లోని పాట ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఆ పాట గురించి కాదు.. 'లుంగీ పెయింటింగ్స్‌' సంగతి.. నల్లని శరీర ఛాయలో జరీ బోర్డరు ఉన్న తెల్లని లుంగీలు ధరించిన, ముఖం కనిపించకుండా గుంపుగా నుంచొన్న పురుషుల చిత్రాల గురించి. ప్రస్తుతం కొచ్చి తీరాన జరుగుతున్న కొచ్చి-ముజిరిస్‌ బినాలేలో భాగంగా 'బ్రదర్స్‌.. ఫాదర్స్‌.. అంకుల్స్‌..' పేరుతో దేవి అనే కళాకారిణి చిత్రించిన ఈ చిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు, వాటిని చిత్రించడం వెనుక దాగున్న సామాజిక అంశం ప్రతిఒక్కరినీ ఆలోచనల్లోకి నెట్టేస్తోంది. అంతలా ఏముంది అందులో.. అందరినీ ఆలోచింపజేస్తున్న ఆ అంశం ఏంటి..

Brothers-Fathers-Uncles-Have-you-seen-this

హిరంగ ప్రదేశాల్లో గుమిగూడిన జనాలు.. టీ షాపులు, కాఫీ దుకాణాల్లో గంటలకొద్దీ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోవడం.. బాతాఖాని కొట్టడం.. వంటివన్నీ గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా కనిపించే దృశ్యాలే.. అయితే అటువంటి చోట ఎప్పుడైనా ఎవరైనా మహిళలను చూశారా? ఎక్కడా చూసి ఉండరు.. ఆ అంశమే దేవీని ఆలోచనల్లో పడేసింది. సామాజికంగా స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తన చిత్రాల ద్వారా.. కొంచెం వ్యంగ్యంగా ఆమె చెప్పాలనుకున్నారు. అలా ఈ 'లుంగీ' చిత్రాలు ప్రాణం పోసుకున్నాయి..
         దేవి ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో 'ఎ షూబాక్స్‌ ఎ స్టూడియో'లో పనిచేస్తున్నారు. మహిళలపై అనాదిగా అమలవుతున్న సాంస్కృతిక అంశాలపై ఓ సిరీస్‌ చేయాలన్న ఆలోచన అప్పటినుండే మొదలైంది. 'నా పని తటస్థంగా ఉండాలి. నేను తీసుకున్న అంశం ప్రపంచంలో ఏ మూల నుండైనా సంబంధం కలిగినదై ఉండాలి అనుకున్నాను. పెళ్లి కోసం నాపై ఇంట్లో తెచ్చిన ఒత్తిడి పితృస్వామ్య సంస్కృతిని విప్పి చూపించింది. అప్పుడు నన్ను ఎన్నో ఆందోళనలు చుట్టుముట్టాయి' అంటున్న ఆమె కేరళలో పుట్టకపోయినా తిరువనంతపురాన్ని తన పుట్టిల్లుగా భావిస్తుంది. ఆ చనువుతోనే గతేడాది ఆగస్టులో బినాలేకి సిద్ధమయ్యేందుకు రెక్కలుగట్టుకుని వాలిపోయింది. బినాలే నిర్వాహకుడు బోస్‌ కృష్ణమాచారి సూచనతో 6-6, 6-9, 6-12 అడుగుల సైజుల్లో పెద్ద కాన్వాస్‌లపై చిత్రాలు వేసింది. ఆ కాన్వాస్‌లను నేలపై పరిచి మరీ పెయింటింగ్‌ వేసింది. ఆ చిత్రాలు వేస్తున్న దృశ్యాలను ఓ ఫొటో తీసి తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ ఫొటో బాగా వైరల్‌ అయిన విషయం పక్కనబెడితే.. దేవి వేసిన పెయింటింగ్‌లు బినాలేలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
        లుంగీలు ధరించిన నలుగురైదుగురు పురుషులు... ఒకరు కాలితో లుంగీని పైకి మడుస్తూ.. మరొకరి చేతిలో వార్తాపత్రిక, ఇంకొకరు రెండు చేతుల్తో లుంగీని పైకి లాక్కోవడం.. ఇలా రకరకాల భంగిమల్లో చాలా ప్రశాంతంగా నుంచొన్న దేవి వేసిన మూడు చిత్రాలను చూస్తూ సందర్శకులు అక్కడే నిలబడిపోతున్నారు. 'నాలుగు గోడలపై పొడవాటి కాళ్లు.. నల్లని ఛాయ ఉన్న ఈ వ్యక్తులు ఏ ఒక్క కులానికో... మతానికో చెందిన వారు కారు.. వీరంతా భారతీయులన్న భావన కలిగేందుకే నేనీ చిత్రాలను గీశాను' అంటున్న దేవి ఇంకా ఇలా చెబుతున్నారు.
       'ఈ చిత్రాల్లో ఏ పురుషుని ముఖం నేను గీయలేదు. అది అవసరం కూడా లేదు. ఆ చిత్రం చూస్తున్న ప్రతి ఒక్కరూ పురుషులు ధరించిన లుంగీలనే తదేకంగా చూస్తున్నారు. ఆ దృష్టి నుండే నేను ఓ సందేశం చెప్పాలనుకున్నాను' అంటున్న దేవి తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఇలా చెబుతున్నారు. 'ఓ రోజు ఓ కేఫ్‌ ఎదుట ఒకతను చాలా ఫార్మల్‌ డ్రస్‌ (లుంగీ) వేసుకుని నుంచొని తన స్నేహితులతో మాట్లాడడం చూశాను. అది చాలా సాధారణ దృశ్యమే కావచ్చు. కాని ఆ స్వేచ్ఛ మహిళలకు ఎందుకు లేదన్న ప్రశ్న నన్ను ఈ చిత్రాలు గీయడానికి ప్రేరేపించినట్లు' ఈ సందర్భంగా ఆమె చెబుతున్నారు.
         ఆమె గీసినవి మూడు చిత్రాలే అయినా ఎన్నో వేల ప్రశ్నలు ఉదయిస్తాయి. 'సామాజిక సమావేశాలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు లేకపోవడం అతి సాధారణంగా చూస్తారు. కాని ఈ పని మహిళలు చేయలేరు.. పురుషులు మాత్రమే చేయగలరు.. అన్న ధోరణి ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇది నా ఇంట్లో కూడా చూశాను. నేనే కాదు.. అందరి ఇళ్లల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏ ఒక్కరోజే కనిపించేది కాదు.. లేక ఆ ఏడాదే చూసింది కాదు.. ఏళ్ల తరబడి ఇది సాగుతోంది' అంటూ సాధారణంగా కనిపించే చిత్రాల్లో సామాజిక అంశాన్ని మేళవించిన దేవి భవిష్యత్తులో ఓ గది నిండిపోయే చిత్రాలను గీయాలని కోరుకుంటున్నారు.