Sep 23,2022 07:53
  • రాత్రి 7.00గం||ల నుంచి

నాగ్‌పూర్‌: తొలి టి20లో టీమిండియా భారీస్కోర్‌ చేసినా.. బౌలర్ల వైఫల్యంతో ఆ మ్యాచ్‌ చేజారింది. దీంతో సిరీస్‌ రేసులో నిలవాలంటే టీమిండియా నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. తొలి మ్యాచ్‌కు ఫిట్‌నెస్‌ నిరూపించుకోని జస్ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే రెండో టి20కి అందుబాటులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత బ్యాటర్స్‌ రాణించడంతో 20 ఓవర్లలో 208పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. కానీ ఆసీస్‌ను ఆ తర్వాత కట్టడి చేయడంలో మన విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు 19.2ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఆ మ్యాచ్‌తో డెత్‌ ఓవర్లలో టీమిండియా బౌలర్ల వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఈ మ్యాచ్‌కు జస్ప్రీత్‌ బుమ్రా, దీపక్‌ చాహర్‌ ఫిట్‌నెస్‌ సాధించడం కొంత ఊరటనిచ్చే అంశం. డెత్‌ ఓవర్లలో వీరు సమర్ధవంతంగా బౌలింగ్‌ చేయగలరు. మొహాలీ టి20లో భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌ చివర్లో ఒక్కో ఓవర్‌కు 15కు పైగా పరుగులు సమర్పించుకొన్నారు. వీరు ఆసీస్‌ బ్యాటర్స్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఆసియాకప్‌ రాణించిన ఎడమచేతి వాటం పేసర్‌ ఆర్ష్‌దీప్‌ సింగ్‌ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న ఉమేశ్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీసినా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఉమేశ్‌ స్థానంలో దీపక్‌ చాహర్‌ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. మరో పేసర్‌ మహ్మద్‌ షమీ కోవిడ్‌ బారినపడి ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. మొహాలీ టి20లో భారత బ్యాటర్స్‌ ఫామ్‌లోకి రావడం ఊరటనిచ్చే అంశం. కేఎల్‌ రాహుల్‌ 35బంతుల్లోనే 55పరుగులు, హార్దిక్‌ పాండ్యా 30బంతుల్లో 70పరుగులు, సూర్యకుమార్‌ యాదవ్‌ 25బంతుల్లో 46పరుగులు చేశారు. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌ను ముగించడంతో హార్దిక్‌ సిద్ధహస్తుడు. తొలి మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ చివరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టి తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే.. యువ ఆల్‌రౌండర్‌ కామరూన్‌ గ్రీన్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతడు 30బంతుల్లోనే 61పరుగులు చేసి ఆసీస్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. స్టీవ్‌ స్మిత్‌ నిరాశపరిచినా.. మిఛెల్‌ మార్ష్‌, వేడ్‌ కలిసి మ్యాచ్‌ను ముగించారు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నేడు జరిగే రెండో టి20 ప్రాధాన్యతను సంతరించుకుంది.
జట్లు అంచనా
భారత్‌ : కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌(కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, విరాట్‌ కోహ్లి, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా, కార్తీక్‌(వికెట్‌ కీపర్లు), చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, బుమ్రా.
ఆస్ట్రేలియా : ఫించ్‌(కెప్టెన్‌), స్మిత్‌, టిమ్‌ డేవిడ్‌, గ్రీన్‌, సామ్స్‌, మ్యాక్స్‌వెల్‌, ఇంగెల్స్‌(వికెట్‌ కీపర్‌), జంపా, హేజిల్‌వుడ్‌, రిచర్డుసన్‌, కమ్మిన్స్‌.