Sep 29,2022 16:57

ముంబయి: టి20 ప్రపంచకప్‌కు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వెన్ను నొప్పి తిరగబెట్టినట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో తొలి టి20కి ముందు బుమ్రా వెన్నునొప్పిగా ఉందని చెప్పడంతో అతనికి బిసిసిఐ విశ్రాంతినిచ్చింది. అయితే ఈ సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లతోపాటు టి20 ప్రపంచకప్‌నకూ అందుబాటులో ఉండకపోవచ్చని బిసిసిఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. బిసిసిఐ వైద్యబృందం బుమ్రాను పరీక్షించారని, అతనికి కనీసం మూడు నుంచి ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరమని చూసించినట్లు ఆ అధికారి తెలిపారు. ఆసియాకప్‌ టోర్నీకి దూరమైన బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టి20ల సిరీస్‌లో పాల్గొన్నారు. మూడో టి20లో 4ఓవర్లలో 50పరుగులు సమర్పించుకొని నిరాశపరిచాడు. ఇక గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఇప్పటికే దూరం కాగా.. తాజాగా బుమ్రా కూడా టి20 ప్రపంచకప్‌కు దూరం కావడం బిసిసిఐని కలచివేస్తోంది. బుమ్రా గాయంపై బిసిసిఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. ఒకవేళ బుమ్రా దూరమైతే.. అతని స్థానంలో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం షమీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన స్టాండ్‌బై ప్లేయర్ల జాబితాలో ఉన్నాడు.