
- కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపు రూ.లక్ష
- పత్తి రైతుకు 'మద్దతు' ప్రమాదం
- స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఇప్పటి వరకు పత్తి రైతులకు కాస్తంత అండగా ఉన్న భారత పత్తి సంస్థ (సిసిఐ) మూసివేత బాటలో పయనిస్తోంది. కేంద్ర సంస్థల మూసివేత జాబితాలో సిసిఐని చేరుస్తారన్న భయాందోళనలకు మొన్న మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బలాన్ని చేకూరుస్తోంది. జౌళిశాఖ పరిధిలో గల సిసిఐ, పత్తి పంట ధరలు పతనమైన సందర్భాల్లో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)పై ప్రత్యేకంగా కేంద్రాలు తెరిచి రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. అందుకు సంబంధించిన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం- ప్రైస్ సపోర్ట్ స్కీం (ఎంఐఎస్-పిఎస్‌ఎస్)కు 2023-24 బడ్జెట్‌లో కేంద్రం కేవలం లక్ష రూపాయలు ప్రతిపాదించింది. 2021-22 బడ్జెట్‌లో ఆ పద్దునకు రూ.8,331 కోట్లు ఖర్చు చేసింది. 2022-23లో రూ.9,232 కోట్లు ప్రతిపాదించింది. సవరించిన బడ్జెట్‌లో రూ.780 కోట్లకు కేటాయింపులు కోసింది. వచ్చే ఏడాదికి కేవలం రూ.లక్ష మాత్రం ప్రతిపాదించింది. ఈ పరిణామంతో సిసిఐ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. కేంద్ర చర్యలతో పత్తి పండించే రాష్ట్రాలు, రైతుల్లో ఆందోళన పెరిగింది. కార్పొరేషన్‌ను పూర్తిగా ఎత్తేయడమో లేదంటే వేరే కార్పొరేషన్‌లో విలీనం చేయడమో చేస్తారని చెబుతున్నారు. జూట్ కార్పొరేషన్ పరిధిలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
సహాయ నిరాకరణ
1956- కంపెనీల చట్టం కింద 1970లో సిసిఐ ఏర్పాటైంది. మార్కెట్‌లో ధరలు పతనం అయినప్పుడు రైతుల నుంచి ఎంఎస్‌పిపై ముడి పత్తిని కొనుగోలు చేయడం, దేశీయ జౌళి పరిశ్రమల అవసరాలకు సరఫరా చేయడం, మిగిలిన పత్తిని విదేశాలకు ఎగుమతి చేయడం సంస్థ ప్రధానోద్దేశం. నష్టాలొస్తే వాటిని కేంద్రం భరించాలి. దేశ వ్యాప్తంగా నాలుగు జోన్లు, 19 బ్రాంచిలు, 400 పైన పత్తి కొనుగోలు కేంద్రాలను సిసిఐ నడుపుతోంది. మోడీ ప్రభుత్వం వచ్చాక సిసిఐకి కేంద్ర సహాయం తగ్గుతూ వచ్చింది. అంతర్జాతీయ ధరల్లో హెచ్చుతగ్గులు, రైతుల నుంచి పంట కొనుగోళ్లు, అన్నింటికీ మించి విదేశాల నుంచి దిగుమతులు వచ్చిపడటంతో సిసిఐ నష్టాల్లోకి చేరింది. నష్టాలను భరించకుండా పేరబెట్టడంతో సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారింది. కార్పొరేట్ల లాభాలకు రైతులను బలిపెట్టేందుకు ఏకంగా సిసిఐని మూసివేసేందుకు నిర్ణయించి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని చెబుతున్నారు.
రాష్ట్ర రైతుకు నష్టం
పత్తిని గణనీయంగా సాగు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. పైగా ఏడాదికేడాది సాగు పెరగడంతో పాటు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కౌలు రైతులు పత్తిని అధికంగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో 17 లక్షల ఎకరాల్లో వేశారు. 55 లక్షల క్వింటాళ్ల ముడి పత్తి దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కర్నూలు, నంద్యాల, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, విజయనగరం తదితర జిల్లాల్లో పత్తి ఎక్కువ సాగవుతోంది. పత్తి ధరలు జూదాన్ని తలపిస్తున్నాయి. ఆ క్లిష్ట సమయంలో రైతులకు కాస్తంత ఎంఎస్‌పి గ్యారంటీ ఇచ్చేవి సిసిఐ కేంద్రాలు. రాష్ట్రంలో పండే పత్తిలో 40 శాతం వరకూ సిసిఐ కొంటోంది. సిసిఐని మూతేస్తే పత్తి రైతులు మరింత నష్టపోతారు. కేంద్రం సిసిఐకి బడ్జెట్ కేటాయింపులు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేదు.
