
- 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థలాల పంపిణీ
- శ్రీనివాససేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో హాస్టల్ బ్లాక్‌ల ప్రారంభించిన సిఎం
ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద తిరుపతిలో రికార్డు సమయంలో నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లైఓవర్‌ను సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని మామిడికాయల మండీ వద్ద జరిగిన శ్రీనివాస సేతు ప్రారంభోత్సవంలో సిఎం జగన్ మాట్లాడుతూ రూ.650.50 కోట్లతో 7 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫ్లై ఓవర్ తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఆభరణం లాంటిదన్నారు. ఇది ఇంజినీరింగ్ అద్భుతమని, దీని వల్ల ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని, యాత్రికులు సులభంగా తిరుమలకు చేరుకోగలగుతారని చెప్పారు.
హాస్టల్ బ్లాక్‌ల ప్రారంభం
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 37.80 కోట్ల రూపాయలతో టీటీడీ నిర్మించిన రెండు హాస్టల్ బ్లాకులను సీఎం జగన్ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. హాస్టల్ బ్లాకుల్లో మొత్తం 181 గదులు ఉన్నాయి. ఇందులో 750 మంది విద్యార్థులు బస చేయవచ్చని తెలిపారు.
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ వడమాలపేట మండలం పాదిరేడు గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం టీటీడీ చరిత్రలో ఒక మహత్తర ఘట్టమన్నారు. మొత్తం 6700 మంది టీటీడీ ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం రూ.313 కోట్ల వ్యయంతో 3,518 మందికి ఇంటిస్థల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, రూ.280 కోట్ల వ్యయంతో మిగిలిన ఉద్యోగులకు కూడా 30 నుండి 45 రోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రివర్యులు హామీ ఇచ్చారు. అనంతరం కొంతమంది ఉద్యోగులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అంతకుముందు తిరుపతి శాసనసభ్యులు, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో గతంలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు మంజూరయ్యాయని, తిరిగి వారి కుమారుడు జగన్మోహన్‌రెడ్డి హయాంలోనే ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని తెలిపారు. తండ్రీ కొడుకుల హయాంలో టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా పని చేయడం తన అదృష్టమన్నారు. టీటీడీ ఉద్యోగుల దశాబ్దాల కలను సాకారం చేసినందుకు ముఖ్యమంత్రివర్యులకు కతజ్ఞతలు తెలిపారు. సమావేశం ప్రారంభంలో ఈ మూడు కార్యక్రమాలకు సంబంధించి ఆడియో విజువల్‌ను ప్రదర్శించారు.
గంగమ్మను దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ సిఎం జగన్ తిరుమలకు బయలుదేరే ముందు తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలం సురేష్, రోజా, తుడా ఛైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డెప్యూటీ మేయర్ భూమన అభినరు రెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్‌పి పరమేశ్వర్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ హరిత, టీటీడీ జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఛీప్ ఇంజినీర్ నాగేశ్వరరావు, జిల్లా, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.