
గుంటూరు: రైతులకు తక్కువ ఖర్చుతో ఆధునిక వ్యవసాయ పరికరాలను తీసుకురావాలనే ఉద్దేశంతో 'వైఎస్‌ఆర్ యంత్రసేవ' పథకం ప్రారంభించినట్లు ఏపీ సీఎం జగన్ అన్నారు. గుంటూరులోని చుట్టగుంటలో నిర్వహించిన వైఎస్‌ఆర్ యంత్రసేవా పథకం కింద వ్యవసాయ పరికరాల పంపిణీని సీఎం ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను ఆయన పంపిణీ చేశారు. దీంతో పాటు రూ.125.48 కోట్ల రాయితీ మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద 2,562 ట్రాక్టర్లు, 100 హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో పంపిణీ పూర్తిచేశామన్నారు. ఇంకా ఎవరైనా మిగిలితే దరఖాస్తు చేసుకోవాలని.. వారికి అక్టోబర్‌లో యంత్ర పరికరాలను అందజేస్తామని తెలిపారు.