May 29,2023 10:58

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కోరారు. ఆదివారం నాడిక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. అమిత్‌ షా నివాసంలో 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలిపేలా చూడాలని కోరారు. వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్‌ ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఏపి భవన్‌ విభజన సహా షెడ్యూల్‌ 9, 10 ఆస్తుల విభజనపై అమిత్‌షాతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిల అంశాన్నీ ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఏపి విద్యుత్‌ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని వెంటనే బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.