Dec 08,2022 22:30

ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు నియామకం
ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు
సచివాలయం యూనిట్‌గా పార్టీ యంత్రాంగం పని
ఇదే టీమ్‌తో ఎన్నికలకు సమాయత్తం కావాలి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో 2024లో జరగనున్న ఎన్నికలకు అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పక్కా వ్యూహప్రణాళికతో శంఖారావం పూరించింది. ప్రతి ఇంటికీ నిరంతరం వైసిపి కార్యకర్త అందుబాటులో వుండేలా ప్రతి 50 ఇళ్లను ఒక క్లస్టర్‌గా విభజించారు. ఈ క్లస్టర్లలో గృహ సారధుల పేరుతో ఇద్దరిని నియమించనున్నారు. ఇప్పటి వరకూ గ్రామ, వార్డు స్థాయిలో వుండే బూత్‌ కమిటీలు ఇక సచివాలయ స్థాయిలో పనిచేసేలా ప్రణాళిక తయారు చేశారు. ప్రతి సచివాలయానికి ఒక మహిళ తప్పనిసరిగా వుండేలా ముగ్గురు కన్వీనర్లను నియమించనున్నారు. సచివాలయ కన్వీనర్ల పనిని పర్యవేక్షించేందుకు నియోజకవర్గ స్థాయిలో పరిశీలకులను నియమించనున్నారు. ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో సంబంధం లేకుండా వీరు పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెల్లాలి. దీనికోసం 5.2 లక్షల మంది గృహసారధులను నియమించనున్నారు. గృహసారధులతో పని చేయించేందుకు సచివాలయం పరిధిలో పార్టీపట్ల అవగాహన వున్న ముగ్గురిని కన్వీనర్లుగా మొత్తం 45 వేల మందిని నియమిస్తారు. వీరంతా నియోజకవర్గంలో పార్టీ అబ్జర్వర్లకు ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వాల్సి వుంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించే అంశంలో పార్టీ అబ్జర్వర్లే క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. అధికార వైసిపి పార్టీ ఇలా మొత్తం క్షేత్రస్థాయిలో ప్రతిఇంటికి చేరువ అయ్యేలా పార్టీని మొత్తం వ్యవస్థీకరించనుంది.
ఎన్నికలకు సమాయత్తం : సిఎం
2024 ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా గురువారం తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాయంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, రీజనల్‌ కోఆర్డినేటర్లతో పార్టీ అధినేత హోదాలో సిఎం జగన్మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని రీతిలో సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అందించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం, పట్టణ ప్రాంతాల్లో 84 శాతం కుటుంబాలకు మేలు చేశామన్నారు. మరో 18 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ యంత్రాంగాన్ని మొత్తం వ్యవస్థీకరించనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి పార్టీ సందేశం వెల్లేలా 50 ఇళ్లకు ఇద్దరు గృహసారథులు వుంటారని, వీరిపై ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లు పర్యవేక్షణ వుంటుందని తెలిపారు. బూత్‌ కమిటీ బలంగా వుంటే 175కు 175 స్థానాలను సునాయసనంగా కైవసం చేసుకుంటామని తెలిపారు. పార్టీలో ఎక్కడైనా చిన్నచిన్న విభేదాలు వస్తే జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలను గెలిపించే బాద్యత మొత్తం అబ్జర్వర్ల చేతిలో వుంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలను గెలిపించాక వచ్చే ప్రభుత్వంలో అబ్జర్వర్లందరికీ సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఈ పని చేయలేము అనే వారు వుంటే ముందుగానే చెప్పాలని అలా కాకుండా బాధ్యతలు తీసుకొని పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించారు. ఈ నిర్మాణం అంతా డిశంబర్‌ 20లోపు పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు.