May 16,2023 12:55

బాపట్ల : బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా ఐదో విడత వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులను సిఎం వైఎస్‌.జగన్‌ మంగళవారం విడుదల చేశారు. దీనికి ముందుగా వైఎస్సార్‌ మత్స్యాకార భరోసా నిధుల విడుదల కార్యక్రమం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సిఎం జగన్‌ పరిశీలించారు. సభా వేదికపై కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు.

అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తూ .... ప్రభుత్వంపై తప్పుడు కథనాలతో ఈనాడు బురద చల్లుతోందని విమర్శించారు. గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20 వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం మాత్రమే అందిందని.. టిడిపి ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేదని చెప్పారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమే అని, ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ.231 కోట్లు ఇస్తున్నామన్నారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారని, చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతి.. అధికారంపోతే జూబ్లీహిల్స్‌ అని ఎద్దేవా చేశారు. ఏపీలో దోచుకొని ఆ తరువాత హైదరాబాద్‌లో ఉండటం వారి పని అని దుయ్యబట్టారు. తనకు మాత్రం ఎపిలోనే శాశ్వత నివాసం ఉందని, తాడేపల్లిలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నానని అన్నారు. '' ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న పెద్ద మనిషి.. ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా ? '' అని ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదనీ, ఆయనకు సభలు పెట్టే ధైర్యం కూడా లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా అని ప్రశ్నించారు.
          చంద్రబాబు, తన దత్తపుత్రుడు నమ్ముకున్నది పొత్తులు, కుయుక్తులనేనన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్కపథకం గుర్తు రాదనీ, ఆయన పేరు తలిస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోటేనని సిఎం జగన్‌ ఘాటు విమర్శలు చేశారు. ఎన్ని వ్యవస్థలను తనపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదని, ప్రజల తరపున నిలబడి మంచి చేస్తున్నానని అన్నారు. ' మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి ' అని కోరారు. ప్రధానిని కలిస్తే చాలు తనపై దుష్ప్రచారం చేస్తారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌తో అంటకాగిన వాళుతనను విమర్శిస్తున్నారని, పొత్తులు పెట్టుకొని.. తెగదెంపులు చేసుకునేది వీళ్లేనని.. వివాహాలు చేసునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లేనని ముఖ్యమంత్రి జగన్‌ దుమ్మెత్తిపోశారు.