
- 26న రాజధాని అమరావతిలో 50 వేల మందికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
ప్రజాశక్తి-కృష్ణా ప్రతినిధి, కలెక్టరేట్ (కృష్ణా) : మరో రెండేళ్లలో బందరుకు పూర్వవైభవం రాబోతోందని, దాని రూపురేఖలు మారబోతున్నాయని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి అన్నారు. ఈ నెల 26న రాజధాని అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నామని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఉత్తర మండలం తపిసపూడి గ్రామంలో రూ.5,254 కోట్లతో చేపట్టిన బందరు గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులకు సోమవారం ఆయన భూమి పూజ చేశారు. ముందుగా తపసిపుడి గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి... సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పైలాన్‌ను ఆవిష్కరించారు. 2.2 కిలోమీటర్ల పొడవైన పోర్టు బ్యాక్ వాటర్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఇక్కడ సముద్ర వర్తకానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తొలిదశలో ఇక్కడ రూ.5,550 కోట్లతో పోర్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. నాలుగు బెర్త్‌ల ద్వారా 35 మిలియన్ టన్నుల సరకు రవాణా జరగనుందన్నారు. ట్రాఫిక్ పెరిగే కొద్దీ బెర్త్‌ల సంఖ్య పెంచుతూ 116 మిలియన్ టన్నులకు సరుకు రవాణాను విస్తరించుకునే అవకాశం ఉందని తెలిపారు. దీంతో, మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, ఛతీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. పోర్టుకు కనెక్టవిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో భాగంగా 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 216 జాతీయ రహదారిని, 7.5 కిలోమీటర్లు దూరంలో ఉన్న గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైన్‌ను, బందరు కాలువ నుంచి రోజుకు 0.5 మిలియన్ లీటర్ల నీటిని తీసుకురావడానికి 11 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించి అనుసంధానం చేస్తామని తెలిపారు. గతంలో బందరు జిల్లా కేంద్రంగా ఉన్నా ఒక్క అధికారీ ఇక్కడ ఉండేవారు కాదని, ఇప్పుడు కలెక్టర్‌తో సహా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంటోందన్నారు. బందరులో ఇప్పటికే రూ.420 కోట్లతో ఫిషింగ్ హార్బర్ పనులు, రూ.550 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
- మచిలీపట్నానికి చంద్రబాబు ద్రోహం
మచిలీపట్నానికి చంద్రబాబు తీరని ద్రోహం, తీవ్ర అన్యాయం చేశారని, పోర్టు రాకుండా ఆటంకాలు సృష్టించారని జగన్ విమర్శించారు. బందరుకు పోర్టు రాకపోతే అమరావతికి డిమాండ్ ఉంటుందని భావించి కుట్ర చేశారన్నారు. పోర్టు రాకూడదని వేల ఎకరాలను కొనుగోలు చేశారని, తాను అమరావతిలో కొన్న భూముల రేట్లు పెంచుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఇప్పుడు బందరు పోర్టు నిర్మాణానికి గ్రహణాలు తొలగిపోయాయన్నారు.
- రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం
రాజధాని అమరావతిలో 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, వారికి ఈ నెల 26న ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని జగన్ తెలిపారు. పేదల ఇళ్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకునే యత్నం చేశారని విమర్శించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించామన్నారు. కానీ, చంద్రబాబు, ఆయన దొంగల ముఠా దానిని అడ్డుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. అయినా అన్ని సమస్యలు, కోర్టు కేసులు అధిగమించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామన్నారు. పేదలకు ఏనాడూ సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు ఆ స్థలాలను సమాధులతో పోల్చడం ఆయన అహంకారానికి నిదర్శమనమని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్‌కె.రోజా, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, బందరు ఎంపి వల్లభనేని బాలశౌరి, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, ఎంఎల్‌ఎ పేర్ని నాని, జడ్‌పి చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, అధికారులు పాల్గన్నారు.
- సిపిఎం నేతల అక్రమ అరెస్టు
ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, నగర కమిటీ సభ్యులు చిరువోలు జయరావులను సోమవారం పోలీసులు ముందుస్తు అక్రమ అరెస్టు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు ఇనకుదురు పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతరం స్టేషన్‌కు తీసుకెళ్లి మధ్యాహ్నం వరకు ఉంచారు. నేతల అరెస్టును సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు ఖండించారు. ఎటువంటి నిరసనలకూ పిలుపు ఇవ్వనప్పటికీ ఎందుకు అరెస్టు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.