
- 1000కి పైగా పోస్టులు!
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) త్వరలో విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో గురువారం ఎపిపిఎస్‌సి అధికారులు కలిశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని సిఎంకు అధికారులు వివరించారు. పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతుందని వెల్లడించారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. గ్రూప్-1కు సంబంధించి సుమారు 100కు పైగా పోస్టులు, గ్రూప్-2కు సంబంధించి సుమారు 900కు పైగా పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.