Aug 09,2022 21:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఈ ఏడాది అక్టోబరు 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడ నగరంలో సిపిఐ 24వ జాతీయ మహాసభలు జరగనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. నగరంలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాలులో జరిగే ఈ మహాసభలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. దేశంలోని అన్ని కమ్యూనిస్ట్‌ పార్టీల నాయకులతోపాటు దాదాపు 30 దేశాల్లోని కమ్యూనిస్ట్‌ పార్టీలు, వర్కర్స్‌్‌ పార్టీ నాయకులు హాజరై సౌహార్ద సందేశం ఇస్తారని తెలిపారు. విజయవాడలోని దాసరి భవన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మహాసభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరై సౌహార్ద సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1961లో 6వ జాతీయ మహాసభలు, 1975లో జరిగిన 10వ మహాసభల తర్వాత ఇప్పుడు 24వ మహాసభలు రాష్ట్రంలో జరుగుతాయన్నారు. దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విధ్వంస పాలన జరుగుతోందన్నారు. విపక్షాలకు చెందిన 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి వేశారని విమర్శించారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేసి జైళ్లలో పెడుతున్నారన్నారు. ఎఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీని కూడా విచారణ పేరుతో హింసించారని అన్నారు. 28 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి కట్టబెట్టారన్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ధరల నియంత్రణ, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా కేంద్ర బిజెపి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మేరకు సిపిఐ దేశవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేసేందుకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సిపిఐ రాష్ట్ర నాయకులు జి ఓబులేసు, అక్కినేని వనజ, కె రామాంజనేయులు, దోనెపూడి శంకర్‌ తదితరులు పాల్గన్నారు.