
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :అగ్నిపథ్ రిక్రూట్మెంటు కోసం కార్పొరేట్ సంస్థల నుంచి ఫండ్స్ తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఇది శోచనీయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకాన్ని దేశమంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా, మూర్ఖంగా ముందుకుపోవడాన్ని సిపిఎం ఖండిస్తున్నట్లు వెల్లడించారు. సైనికులను రిక్రూట్ చేసే విధానాన్ని సమూలంగా మార్చి, దేశప్రయోజనాలను, రక్షణను దెబ్బతీసే అగ్నిపథ్ కార్పొరేట్ ప్రయోజనాల కోసమేనని దీన్నిబట్టి మరోసారి రుజువైందని విమర్శించారు. కార్పొరేట్స్ ప్రైవేట్ సైన్యం కోసమే ఈ విధానాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిందని తేటతెల్లమైందని పేర్కొన్నారు. అగ్నిపథ్ స్కీంలో భాగంగా ఈ నెల 14 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఆర్మీ నియామక ర్యాలీకి రూ.1.54 కోట్లు ఖర్చవుతుందని, దీనికి రూ.5లక్షలకు తగ్గకుండా కార్పొరేట్ ఫండ్ తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టరు జారీచేసిన ఉత్తర్వులను ప్రకటనతోపాటు పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి ఈ ఉత్తర్వులను ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు.