Oct 05,2022 17:46

ఢిల్లీ: టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్‌ కోహ్లీని గొప్ప కెప్టెన్‌గా తాను పేర్కొనలేంటూ వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ విన్‌స్టన్‌ బెంజిమన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా క్రికెట్‌ గురించిన తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు.
''విరాట్‌ను టీమ్‌ఇండియా గొప్ప కెప్టెన్‌ అనడం సరికాదని నేను భావిస్తాను. సారథ్య బాధ్యతలను మోయడం కన్నా అతడు బ్యాటింగ్‌పై మరింత దఅష్టి పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే అలాంటి బ్యాటర్‌ను నేను ఇంతవరకూ చూడలేదు. కొన్నేళ్లుగా భారత క్రికెటర్లు ఎంతో మెరుగ్గా ఆడుతున్నారు. జస్ప్రీత్‌ బుమ్రా వంటి వారు బౌలింగ్‌తో చెలరేగుతున్నారు. ఇంకా ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. కోహ్లీ కన్నా ముందు జట్టును నడిపించిన వారు వ్యూహాత్మకంగా కాస్త మెరుగని నా అభిప్రాయం. కానీ అద్భుతమైన బ్యాటర్లలో అతడు ఒకడు'' అంటూ తెలిపాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో విండీస్‌ జట్టు టాప్‌ 4 లో ఉండొచ్చని విశ్లేషించాడు. అందుకు కారణం వారి అస్థిరమైన ఆటతీరేనన్నాడు. తమను తాము రుజువు చేసుకోవడానికి ఇదో గొప్ప అవకాశం అని, ఇప్పటికైనా ఆ దిశగా వారు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నాడు.
ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారికి శిక్షణ ఇస్తోన్న ఈ సీనియర్‌ ఆటగాడు సచిన్‌ తెండూల్కర్‌కు ఇటీవల ఓ విన్నపం చేసి వార్తల్లో నిలిచాడు. తమ కుర్రాళ్లకు అవసరమైన క్రికెట్‌ కిట్లను అందించాలని సచిన్‌ను కోరగా.. అందుకు పూమా కంపెనీ స్పందించి భారీ సాయం ప్రకటించింది. తాజాగా బెంజిమన్‌ దీనిపై హర్షం వ్యక్తం చేశాడు.