Canada : 150 మంది పంజాబీ విద్యార్థుల బహిష్కరణను ఆపాలి : ప్రభుత్వాన్ని కోరిన ఎన్‌డిపి పార్టీ

కెనడా : భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన 150 మంది విద్యార్థులు నకిలీ అడ్మిషన్ల పత్రాలతో కెనడాలో ఉన్నత చదువులు చదువుకుంటున్నారన్న ఆరోపణలతో కెనడా ప్రభుత్వం వారిని ఆ దేశం నుంచి బహిష్కరించింది. అయితే ఆ విద్యార్థులను బమిష్కరించవద్దని న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌డిపి) కెనడా ప్రభుత్వాన్ని కోరింది. అలాగే నిజాయితీలేని రిక్రూటర్ల ద్వారా అంతర్జాతీయ విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం లేదని ఎన్‌డిపి శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక దీనిపై విద్యార్థులు మాట్లాడుతూ.. 'మే 29వ తేదీకల్లా దేశం విడిచిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది. భారతదేశంలోని కెనడా ఇమ్మిగ్రేషన్ కన్సల్టేషన్ ఏజెన్సీ మాకు నకిలీ పత్రాలను అందించి మోసం చేసింది. ఆ పత్రాలు నకిలీవి అని మాకు తెలియదు' అని విద్యార్థులు వాపోయారు.
కాగా, విద్యార్థుల బహిష్కరణపై ఎన్‌డిపికి చెందిన పార్లమెంట్ సభ్యురాలైన జెన్సీ క్వాన్ ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రీజర్‌కి మే 25వ తేదీన ఈ విషయంపై లేఖ రాశారు. 'ప్రస్తుతం యూనివర్సిటీ విద్య కోసం కెనడాకు వచ్చిన విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారు. విద్యార్థులను మోసం చేసి నకిలీ పత్రాల ద్వారా వారిని మోసగించి రిక్రూటర్లు కెనడాకు పంపారు. ఈ విద్యార్థులకు అత్యవసరంగా ప్రభుత్వం సహాయం చేయాలి' అని ఆమె లేఖలో పేర్కొన్నారు. జెన్నీ క్వాన్ లేఖపై ఇమ్మిగ్రేషన్ మంత్రి ఫ్రీజర్ స్పందించారు. 'మేము దోషులను గుర్తించడంపై దృష్టి సారించాము. మోసపోయిన బాధిత విద్యార్థులను శిక్షించడం లేదు.' అని ఫ్రీజర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే విద్యార్థులకు శాశ్వత స్థితిని కల్పించాలని దీనికి ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఆలోంచించి నిర్ణయం తీసుకోవాలని జెన్సీ కోరారు.
'బహిష్కరణకు గురికాబోయే విద్యార్థుల్లో కొందరు ఇప్పటికే కెనడాలో ఐదు సంవత్సరాలకు పైగా గడిపారు. వారి అధ్యయనాలను పూర్తి చేయడానికి ట్యూషన్ ఫీజులను చెల్లించారు. ప్రస్తుతం వీరిలో చాలామంది అవసరమైన ఫ్రంట్‌లైన్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ చదువుకునేందుకు విద్యార్థులకు నమ్మకం కలిగించడం చాలా కీలకం. విద్యార్థుల అన్యాయమైన బహిష్కరణలను ఆపడానికి వెంటనే చర్య తీసుకోవాలి' అని క్వాన్ ఇమ్మిగ్రేషన్ మంత్రిని ఫ్రీజర్‌ని కోరారు. ఇక 700 మందికి పైగా భారతీయ విద్యార్థులు తమ విద్యాసంస్థ అడ్మిషన్ ఆఫర్ లెటర్‌లు నకిలీవని గుర్తించిన తర్వాత బహిష్కరణను ఎదుర్కొంటున్నట్లు కెనడియన్ బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ విద్యార్థులలో ఎక్కువమంది 2018-19 సంవత్సరాల్లో కెనడాకు చదువుకునేందుకు వచ్చినవారే. కెనడాలో శాశ్వత నివాసం కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు రిక్రూటర్లు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. జలంధర్‌కు చెందిన బ్రిజేష్ మిశ్రా అనే ఏజెంట్ విద్యార్థులకు నకిలీ అడ్మిషన్ లెటర్స్ అందించి.. వారి నుంచి వేల డాలర్లు వసూలు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.