Jun 27,2022 16:14

చెన్నై : నేటికాలంలో.. అబ్బాయిలు బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకుని.. లైఫ్‌లో సెటిల్‌అయినా.. పెళ్లిమాత్రం కావడం లేదు. అమ్మాయి కోసం మ్యారేజ్‌ బ్యూరోలను, బంధువుల్ని సంప్రదిస్తున్నా పెద్దగా ప్రయోజనమేమీ ఉండడం లేదు. దీంతో ఏళ్ల తరబడి తనకు కాబోయే జోడి కోసం నిరీక్షించి.. నిరీక్షించి పెళ్లికాని ప్రసాద్‌లవుతున్నారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ యువకుడు వివాహం చేసుకోవాలని ఐదేళ్లుగా ప్రయత్నాలు చేసి ఫలించకపోవడంతో.. తనకొచ్చిన డిఫరెంట్‌ ఐడియాను ఆచరణలో పెట్టాడు. ఇంతకీ ఆ ఐడియా ఏంటనుకుంటున్నారా? తనకి భార్య కావాలంటూ.. పోస్టర్‌ వేసి అక్కడక్కడా అతికించాడు. ఇది చూసిన జనాలు అవాక్కవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మధురైలో ఉంట్ను 27 ఏళ్ల జగన్‌.. ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడట. నెలకు రూ. 40 వేల జీతం. ఇక పెళ్లి చేసుకోవాలనుకున్న జగన్‌.. తనకు కాబోయే జీవిత భాగస్వామి కోసం వెతకడం మొదలుపెట్టాడట. ఐదేళ్లుగా తానెంత వెతికినా.. ఎవర్ని సంప్రదించినా అమ్మాయి మాత్రం దొరకలేదు. దీంతో అతడికి ఓ ఐడియా తట్టిందట. తాను డిజైనర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో.. తన పేరు, కులం, వృత్తి, కాంటాక్ట్‌ నెంబర్‌, అడ్రస్‌ వివరాలు, తన ఫొటో కూడా వచ్చేలా ఓ పోస్టర్‌ని తయారుచేసి తాను నివసించే ప్రాంతంలోనే కాకుండా.. మరికొన్ని ప్రాంతాల్లోనూ అంటించాడు. ఇప్పుడా పోస్టర్లు తమిళనాడులో వైరల్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో కూడా ఈ పోస్టర్‌ వైరల్‌గా మారింది. మరి జగన్‌ చేసిన ఈ ప్రయత్నం ఫలించి.. ఏ తండ్రి అయినా తమ కుమార్తెనివ్వడానికి ముందుకొస్తారో లేదో చూడాలి.