Aug 09,2022 20:55

ప్రజాశక్తి - అల్లూరి సీతారామరాజు జిల్లా విలేకరుల యంత్రాంగం :అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాడేరులో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర ముఖ్య అతిథిగా పాల్గన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు చెక్కులు అందజేశారు. రాష్ట్రంలోని పలు గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గన్నారు. ఆదివాసీలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజన్నదొర అన్నారు.
గిరిజన సంఘం రంపచోడవరం జిల్లా కార్యదర్శి కుంజా సీతారామయ్య అధ్యక్షతన చింతూరులో సదస్సు నిర్వహించారు. సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవం స్ఫూర్తితో ఆదివాసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దాడికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు రాజవొమ్మంగిలో గిరిజన సంఘాలు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆదివాసీ జెండాను ఎగరవేశారు. అనంతరం స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథిగృహం వద్ద గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, ఇతర సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవ స్ఫూర్తితో జిఒ నెంబర్‌ 3, పీసా చట్టం పటిష్ట అమలుకు, రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ బండంగుడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, పాడేరులో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అప్పలనర్స మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల రక్షణకు పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్టు తెలిపారు.