Jul 03,2022 10:19

విశాఖ నగరంలో 2022 మే 19న ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం.. సాంస్కృతిక, సాహిత్య, అభ్యుదయ, ప్రగతిశీల, శాస్త్రీయ ఆలోచనలకు వేదికగా నిలవనుంది. 1240 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఏడు అంతస్తుల భవనంలో 600 సీట్లు సామర్ధ్యం కల్గిన ఆడిటోరియంలో ఆధునాతన ఎకోస్టిక్స్‌తో సౌండ్‌ సిస్టమ్‌, లైటింగ్‌ ఏర్పాటు చేయడమైంది. రాష్ట్రంలో ఎకోస్టిక్స్‌ సౌకర్యం కల్గిన ఆడిటోరియం ఇది. విజ్ఞాన కేంద్రంలో రెండు మినీ హాళ్లు వున్నాయి. 100 నుంచి 200 మందితో సభలూ, సదస్సులు నిర్వహించుకొనేలా ఇవి తయారయ్యాయి. 500 మందికి సరిపడే బహుళ ప్రయోజనాల హాలు వుంది. డిజిటల్‌ లైబ్రరీ, రెండు డైనింగ్‌ హాళ్లు. రెండు సెల్లార్లు కలిగి వుంది. శాస్త్ర విజ్ఞానం, మహిళాభ్యుదయం, బాలల వికాసం పెంపొందించడానికి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ముఖ్య భూమికను పోషించనుంది. కార్మిక, శ్రామికవర్గ రాజకీయ అవగాహన, ఆలోచనలకు ఇదొక వేదిక కానుంది. ఆర్‌టిసి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌కు సమీపంలో, ప్రజలకు అందుబాటులో ఈ విజ్ఞాన కేంద్రం ఉంది. సాహిత్య, సాంస్కృతిక రంగాలపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టి.. వికాసవంతమైన, అభివృద్ధికరమైన ఆలోచనల వ్యాప్తికి ఈ కేంద్రం వేదికగా నిలవనుంది. విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిపెద్ద మహానగరం కూడా. పారిశ్రామికాభివృద్ధికి, ప్రభుత్వరంగ పరిశ్రమలకు విశాఖపట్నం కేంద్రగా వుంది. ఈ ప్రాంతమిప్పుడు ప్రభుత్వ దాడికి గురవుతోంది. స్టీల్‌ప్లాంట్‌ సహా ప్రభుత్వరంగ పరిశ్రమలపై ప్రయివేటీకరణ కత్తి వేలాడుతోంది. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడే అంశాలపై ఇక్కడ పరిశోధనలు జరగనున్నాయి. మహిళలు, మేధావులు, కళాకారులకు సంబంధించి సాహిత్య, సాంస్కృతిక కళలు, సాహితీ గోష్ఠులు జరగనున్నాయి. నిరంతరం శాస్త్రీయ భావాలు సమాజంలోకి తీసుకెళ్లడానికి, మూఢ నమ్మకాలు, విశ్వాసాలు తొలగించి పరిపూర్ణమైన పౌర సమాజాన్ని తీర్చిదిద్దేందుకు విజ్ఞాన కేంద్రం వేదిక కానుంది. అందుకు శాస్త్రీయ సమ్మేళన బృందాలు పనిచేయబోతున్నాయి. అల్లూరి నడియాడిన ఈ ప్రాంత ప్రజల్లో పురోగమన భావాల వ్యాప్తికి, అల్లూరి సీతారామరాజు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విజ్ఞాన కేంద్రం నిరంతరాయంగా నిబద్ధతలో పనిచేయనుంది.ఈ విజ్ఞాన కేంద్రానికి ఛైర్మన్‌గా సిహెచ్‌ నర్సింగరావు, కార్యదర్శిగా డాక్టర్‌ బి.గంగారావు, కోశాధికారిగా విఎస్‌ పద్మనాభరాజు, ట్రస్టీలుగా కె.లోకనాథం, బి.పద్మ, ఎం.జగ్గునాయుడు, జి.కోటేశ్వరరావు వున్నారు.

- విఎస్‌ పద్మనాభరాజు
కోశాధికారి, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, విశాఖపట్నం

bhavan