
ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖపట్నం : కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు దించిన తల ఎత్తకుండా తిరిగి వస్తున్నార ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. విశాఖ టిడిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్ పక్కన పెట్టి నవరత్నాలను తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఉద్యోగులు సిపిఎస్ మీద ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారని, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతం ఇవ్వాలంటూ ఉద్యోగులు అడుక్కునే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు, అదానీ డేటా సెంటర్ల ప్రారంభోత్సవాలు చేశారని, వీటన్నింటికీ టిడిపి హయాంలో శంకుస్థాపనలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. విశాఖలో భూములు కబ్జా చేస్తూ, మరోపక్క ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అవినాష్ రెడ్డి అరెస్టుపై హైడ్రామా నడుస్తోందని, సిబిఐ అధికారులు జిల్లా ఎస్‌పిని బతిమిలాడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. డిజిపి జోక్యం చేసుకుని అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, టిడిపి పార్లమెంటు కార్యదర్శి పాసర్ల ప్రసాద్ పాల్గొన్నారు.