Aug 05,2022 20:19

ప్రజాశక్తి -కర్నూలు కలెక్టరేట్‌ :ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిస్తూ ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుండడాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మికులు నిరసన తెలిపారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట గాంధీ విగ్రహం సమీపంలో శుక్రవారం నిరసన తెలిపారు. భూమిలేని నిరుపేదలందరికీ భూమి ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి.నారాయణ మాట్లాడుతూ.. గ్రామీణ పేదలకు వరంగా ఉన్న ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రం నీరుగారుస్తోందన్నారు. తొమ్మిది నెలలుగా కూలీలకు వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. భూమిలేని పేదలకు భూములు పంచాలని, ఉపాధిహామీకి బడ్జెట్‌ కేటాయించి 200 రోజులు పనులు, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు నగర కార్యదర్శి ఎండి.అంజిబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ సంక్షోభం వచ్చిందన్నారు. దీంతో గ్రామీణ పేదలకు పనులు లేకపోవడంతో వ్యవసాయేతర పనులపై ఆధారపడుతున్నారని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.వెంకట్‌రాముడు, బికెఎంయు నాయకులు భాస్కర్‌, శ్రీను, సిఐటియు నాయకులు టి.రాముడు, వ్యవసాయ కార్మికులు లక్ష్మిదేవి, ఉమాదేవి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.