Mar 21,2023 09:47

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.155.8 లక్షల కోట్లని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో బిఆర్‌ఎస్‌ ఎంపి నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రం అప్పు జిడిపిలో 57.3 శాతమని అన్నారు. ఇందులో రూ.7.03 లక్షల కోట్లు (2.6 శాతం) విదేశీ అప్పు అని తెలిపారు.
 

                                               93,384 పోలవరం బాధిత కుటుంబాలకు అందని పరిహారం

93,384 పోలవరం బాధిత కుటుంబాలకు ఎటువంటి పరిహారం అందలేదని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడ తెలిపారు. రాజ్యసభలో టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 1,06,006 పోలవరం బాధిత కుటుం బాలుగా గుర్తించామని, అందులో 12,622 కుటుంబా లకు పరిహారం, పునరావాసం కల్పించి తరలించామని తెలిపారు. 93,384 పోలవరం బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని అన్నారు.
 

                                                వైజాగ్‌ మెట్రోకు ప్రతిపాదనలు సమర్పించని ప్రభుత్వం

వైజాగ్‌ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించలేదని కేంద్ర పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. ఎంపి జివిఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలు పంపిందని, అయితే కేంద్ర ప్రభుత్వం 2017 మెట్రో రైలు ప్రాజెక్టు విధానం ఆధారంగా తిరిగి ప్రతిపాదనలు పంపాలని కోరిందని అన్నారు. ఎపి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని పేర్కొన్నారు.