Sep 29,2022 15:05

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్న మిషన్‌ భగీరథకు కేంద్ర ప్రభుత్వ జల్‌జీవన్‌ మిషన్‌ పురస్కారం లభించింది. ఈ పథకం.. నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అన్ని గ్రామాలలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపింది. అక్టోబరు 2న ఢిల్లీలో పురస్కారం అందుకోవాలని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.
''మిషన్‌ భగీరథ' పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడం ఆనందంగా ఉంది.రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తించడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే మిషన్‌ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సులను ఎన్డీయే ప్రభుత్వం గౌరవిస్తే ఇంకా బాగుంటుంది. '' అని ఈ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.