
ముంబయి : మహారాష్ట్ర కూటమి నేత శరద్ పవార్‌ను కేంద్ర మంత్రి ఒకరు బెదిరించారని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ విమర్శించారు. మీ మంత్రి చేసిన బెదిరింపులను ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా మన్నిస్తారా అంటూ ప్రశ్నించారు. ' పవార్ మహారాష్ట్ర బిడ్డ. మోడీ, అమిత్‌షా వినబడుతోందా.? మీ మంత్రి శరద్ పవార్‌ను బెదిస్తున్నారు. మీరు అలాంటి బెదిరింపులు సమర్థిస్తారా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొనగా.. ఏక్నాథ్ షిండేకు రెబల్ ఎమ్మెల్యేలు మద్దతునిస్తుండగా.. మరికొంత మంది శివసేన నేతలు ఉద్ధవ్ థాకరే వైపు ఉన్నారు. అదే సమయంలో తాము ఉద్ధవ్ వెంటేనని శరద్ పవార్ స్పష్టం చేశారు. దీంతో ఆయనకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
' మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని రక్షించాలని శరద్ పవార్ భావిస్తే.. ఆయన ఇంటికి వెళ్లకుండా.. నడిరోడ్డుపై ఆపేస్తాం. బిజెపి చేసేది ఇదే.. ఇప్పుడు మీ అభిప్రాయాన్ని ప్రకటించండని కేంద్ర మంత్రి బెదిరించారు. పవార్‌ను ఇలా బెదిరించడం సరైనది కాదు' అంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.