Sep 26,2022 21:31
  • ధర్నాలో జెఎసి రాష్ట్ర చైర్మన్‌ బాలకాశి

ప్రజాశక్తి - సీతమ్మధార (విశాఖపట్నం) : విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే అక్టోబర్‌ 20న చలో విద్యుత్‌ సౌధా కార్యక్రమాన్ని చేపడతామని జెఎసి రాష్ట్ర చైర్మన్‌ ఎం బాలకాశి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు కాంట్రాక్టు కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యాన విశాఖపట్నంలోని ఎపిఇపిడిసిఎల్‌ సిఎమ్‌డి కార్యాలయం వద్ద సోమవారం ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి బాలకాశి మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాలుగా 24 వేల మందికిపైగా కార్మికులు ఎపి జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కాములలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పని చేస్తున్నారని తెలిపారు. అతి తక్కువ వేతనాలతో సంస్థకు, ప్రజలకు, ప్రభుత్వానికి వీరు సేవలందిస్తున్నారన్నారు. పాదయాత్ర సమయంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని తెలిపారు. కార్మికులందరినీ విద్యుత్‌ సంస్థలో విలీనం చేస్తామని, పనికి తగ్గ వేతనమిస్తామని చెప్పి అధికారంలోకొచ్చాక మోసగించడం తగదన్నారు. పలుమార్లు విజ్ఞప్తులు చేసినా, ఆందోళనలకు దిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఇపిడిసిఎల్‌ సిఎమ్‌డి సంతోషరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు ఎం దుర్గారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌, మీటర్‌ రీడర్స్‌ యూనియన్‌ కార్యదర్శి కె శివారెడ్డి, సెక్షన్‌ ఆపరేటర్స్‌ సంఘం నాయకులు అప్పారావు, సంజరు, రమేష్‌, ఈశ్వర్‌ పాల్గొన్నారు.