Mar 20,2023 07:46

టీవల ఉత్తరాంధ్రలో రెండు అపురూప సాహిత్య సందర్భాలు జరిగాయి. అవి కళింగాంధ్ర గొంతును వినిపిస్తున్నాయి. ఒకటి 'రాజాం రచయితల వేదిక' ప్రచురణలలో గార రంగనాథం గారి సంపాదకత్వంలో 'విస్మృత కళింగాంధ్ర సాహిత్య ప్రభ' అనే 30 వ్యాసాల సంపుటి వెలువరించబడింది. రెండోది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత 'బాల సుధాకర మౌళి' సంపాదకత్వంలో వచ్చిన 'చంపావతి-కళింగాంధ్ర సాహిత్య సంచిక' ఆవిష్కరణ.
       మహానది నుండి గోదావరి నది మధ్య ఆవరించియున్న ప్రాంతాన్ని కళింగాంధ్రం అంటారు. ఈ ప్రాంతం ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. రాయగడ, పర్లాకిమిడి, బరంపురం ప్రాంతాలు ఒరిస్సా రాష్ట్రంలో కలిసాయి. ఆయా ప్రాంతాల్లో తెలుగు వాళ్లే అధికంగా ఉన్నారు. దాంతో కళింగాంధ్రలో అంతర్భాగమైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు (నేడు ఆరు జిల్లాలు) ఉత్తరాంధ్రగా మిగిలాయి. ఉత్తరాంధ్ర సహజ వనరులకు నిలయం. సువిశాల అటవీ, సముద్ర, మైదాన ప్రాంతాలు కలగలిపిన నేలతల్లి. ఈ నేలపై అనేక వీరోచిత పోరాటాలు జరిగాయి. ఇక్కడ జనం ఉద్యమ నేపథ్యం గలవారు. ప్రజా సాహితీ, సాంస్క ృతిక ఉద్యమంలో విరివిగా పాల్గొన్నవారు. శ్రమను నమ్ముకునే వారు కావడంతో కాయకష్టం చేస్తూ జీవనం సాగిస్తారు. నేడు వీరిలో ఎక్కువ శాతం పట్టణాలకు వలసలు పోతున్నప్పటికీ, అక్కడ శ్రమే ఆయుధంగా జీవిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల జీవనశైలి విభిన్నం. గిరిజనులు, మత్స్యకారులు, మైదానవాసులు భిన్న ఆచార వ్యవహారాలు కలవారు. ఈ ప్రాంత మూలవాసులుగా ఉన్న వీరు తమ సంస్క ృతీ సంప్రదాయాలను ఎల్లవేళలా కాపాడుకుంటూ వస్తున్నారు. కాకపోతే ప్రపంచీకరణ వీళ్ళ జీవనశైలికి విఘాతం కలిగిస్తూ సవాలు విసురుతున్నది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ముసుగులో రాజ్యం ఈ ప్రాంతం పై దమనకాండ సాగిస్తున్నది. ఈ ప్రాంతవాసుల మనుగడను ప్రశ్నిస్తూ, కార్పొరేట్‌ శక్తులు తమ కార్యకలాపాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. వీరి ఆగడాలకు ముకుతాడు వేయాలి. అందుకు ఇచ్చట ప్రజలు ఐక్యం కావల్సిందే. అందుకు ఈ ప్రాంత కవులు, రచయితలు, మేధావులు నడుం బిగించాలి. ఈ క్రమంలోనే పైన ఉదహరించిన రెండు సాహిత్య సందర్భాలను నిర్వహించారు.
          మౌళి ప్రచురించిన 'చంపావతి కళింగాంధ్ర సాహిత్య సంచిక' 44 పేజీల ఒక చిన్న పుస్తకం. ఒక పెద్ద ఆశయాన్ని భుజానికి ఎత్తుకొన్నది. ఆదిమ వాసులు వినియోగించిన సంగీత పరికరాల ఛాయాచిత్రాలను ఈ పొత్తంలో ఉంచారు. అలనాటి గిరిజనుల జీవన శైలికి ఈ చిత్రాలు అద్దం పడతాయి. మారుతున్న కాలంలో ప్రపంచీకరణ వల్ల గిరిజనులు వాటికి దూరం కావడాన్ని ఈ చిత్రాల ద్వారా మౌళి ఎరుకపరుస్తారు. ఇందులో 'గంటేడ గౌరునాయుడు' కవిత 'తూర్పు కెరటం' ఉంది. రైతు వేదనలను తన కవితలో హృద్యంగా పలికిస్తారు. నేటి కర్షకుల కష్టాలను కళ్ళముందు పెడతారు కూడా. 'కెక్యూబ్‌ వర్మ' తన 'భూస్వరం' కవితలో 'కళింగ సీమ ఇది/ అమాయకంగా కనిపించే/ ధిక్కార భూస్వరమిది' అని ఈ నేల ఉద్యమ నేపథ్యాలను ఉద్ఘాటించారు. 'ఆకలి గిన్నెలు' అనే 'మొయిద శ్రీనివాసరావు' కవితలో గతంలో జరిగిన నెల్లిమర్ల జ్యూట్‌ మిల్‌ కార్మికుల సమ్మె- దాని పర్యవసనాలను ఆర్ద్రంగా తడుముతూ, వారి ప్రాణ త్యాగాలను మననం చేశారు. 'పొట్టి రెక్కల పిట్ట కథ' అనే కవిత వర్ధమాన కవి కంచరాన భుజంగరావుది. సిక్కోలు ప్రజల చిందర వందర జీవితాలు, శిథిలమైన బతుకులు, వలస జీవన అష్ట కష్టాలు ఏకరువు పెట్టారు. 'నిన్నటి కవిత:ముద్ర'లో సుబ్బారావు పాణిగ్రాహి 'ఈ పాలన మనకెందుకు' అనే గేయ కవితను తీసుకున్నారు. ఐదు దశాబ్దాల క్రితం ఈ నేలపై సాగిన విప్లవోద్యమానికి తన జముకుతో ఊపిర్లు ఊదిన పాణిగ్రాహి, ఆనాటి పాలకుల దమననీతిని ఈ కవిత ద్వారా ఎండగడతారు. దాన్ని మౌళి పున్ణశ్చరణ చేశారు. 'మిత్ర కవిత' పేరిట 'శివారెడ్డి' గారి 'నీలి కాగితం' ఉంచారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంత వాసుల జీవితాలు సముద్రంలా అల్లకల్లోలమనీ, ఆ అలజడి కలకాలం ఉండదనీ, చివరకు ఏదో రూపాన స్వస్థత చేకూరగలదని ఆశాభావం వ్యక్తం చేస్తాడు కవి.
         'బాల సాహిత్యం: చిటికెన వేని'లో పాయల సత్యనారాయణ గారి 'అమ్మో ఆడబతుకు, అక్కా బావా' కవితలను ఉంచారు. నేటికీ ఆడపిల్లలపై సమాజం, తల్లిదండ్రులు ఆంక్షలకు గురి చేయడం పట్ల ఖిన్నుడై విలపిస్తాడు కవి. స్త్రీ పడుతున్న ఇబ్బందులను దయనీయంగా స్పర్శిస్తూ, తద్వారా సమాజం గతిని తూర్పారపడతారు. 'అనువాదాలు: ఇక్కడి గొంతు' శీర్షికలో మల్లిపురం జగదీష్‌, సిరికి స్వామినాయుడుల కవితలను 'మై డ్యూటీ, ది వెయిట్‌, మార్నింగ్‌' పేరిట మౌళి - సుందరం ఇంగ్లీష్‌ అనువాదం అందంగా కూర్పు చేశారు. 'కథ' శీర్షికన అట్టాడ అప్పల్నాయుడు 'సామంత రాజులు' అనే కథను ప్రచురించారు. ఈ కథ ఉత్తరాంధ్ర ప్రస్తుత రాజకీయ సమీకరణలను చూపుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో రాజకీయంగా క్షత్రియ ప్రాబల్యం మెండుగా ఉండేది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అగ్రవర్ణాల ఆధిపత్యం విశాఖలో కొనసాగింది. నేడు ఉత్తరాంధ్రను మూడు ఎగువ వెనుకబడిన తరగతులు రాజ్యాధికారాన్ని వహిస్తున్నవి. అయితే వీరు చక్రవర్తి అడుగుజాడల్లో మెలిగే సామంత రాజులు మాత్రమే. వీరు అగ్రవర్ణ పాలకుల అడుగులకు మడుగులెత్తుతూ, వారి ఆదేశాలను శిరసావహిస్తూ ప్రతినిధులుగా ఉన్నారు. అంతే తప్ప వీరికి ఎటువంటి నిర్ణయాధికారం లేదు. ఈ ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి జరగాలన్నా, లేదా ఏ ఒక్క కార్యక్రమం రూపుదిద్దుకోవాలన్నా చక్రవర్తి కనుసన్నల్లోనే జరుగుతుంది. ఆ చక్రవర్తిని నడిపించే మరొక చోదకశక్తి ఒకటి ఉంటుంది. అది ఏం చెబితే అదే క్షేత్రస్థాయిలో అమలకు నోచుకుంటుంది. ఈ విషయాలను వివిధ పాత్రల ద్వారా, తగు సన్నివేశ రూపకల్పనలతో అట్టాడ తన కథలో వెల్లడించిన తీరు అభినందనీయం.
            'సమీక్ష- స్పర్శ' శీర్షికన 'రైతు లేని కాలం మొదలైందనే ఆవేదనలో పుట్టినవే మాయ కథలు' అనే పుస్తక సమీక్షను డాక్టర్‌ ఆల్తి మోహనరావు రాయగా, దాన్ని ఈ బులిటన్‌లో నిక్షిప్తం చేశారు. ఈ మధ్యన మాయ కథలు మరోసారి పుస్తకంగా వచ్చాయి. ఈ కథల్లోని ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ, విశ్లేషణాత్మకంగా సమీక్ష సాగింది.
            ఈ చిట్టి పుస్తకంలో అట్టాడ వారి 'ముఖాముఖి' ఉంది. మౌళి జరిపిన ముఖాముఖి ఈ సంచికకు హైలెట్‌. అప్పల్నాయుడు కళింగాంధ్ర అస్తిత్వవాద గొంతుక. సందర్భం వచ్చినప్పుడల్లా తన వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర స్వరూప స్వభావాలను, సామాజిక, రాజకీయ ఉద్యమ నేపథ్యాలను ఎరిగినవారు. అందువల్ల నిర్మొహమాటంగా తన వేదనను వెలిబుచ్చారు. గుండెల్లో తూటాలు దిగినట్లు మాట్లాడారు. భౌగోళికంగా అనేక వనరులు గల ఈ ప్రాంతంలో సాహిత్య, సాంస్క ృతిక వారసత్వం కూడా మెండుగా ఉంది. ఇక్కడ బహుజనులు ఎక్కువ. అయినప్పటికీ వారికి లభించే సహకారం స్వల్పం. ఈ ప్రాంతం ఎన్నో రకాలుగా వివక్షకు గురౌతున్నదని అట్టాడ అంటారు. అనేక సాహితీ ప్రక్రియలకు కన్నతల్లిగా ఈ నేలతల్లి పేరెన్నికగన్నది. ఇంతటి విశిష్ట ప్రాంతం నుండి వస్తున్న కళాకారులకు నేడు ఆదరణ కరువైంది. వారికి తగిన ప్రాధాన్యత ప్రభుత్వ సాహిత్య, సాంస్క ృతిక సంస్థలు ఇవ్వడం లేదంటారు అట్టాడ. దీని నివారణకై ఇచ్చట కళాకారులు, మేధావులు ఏకం కావాలని ఈ ముఖాముఖి ద్వారా ఆశిస్తున్నారు. 'నడిచిన దారి' పేరిట కె.ఎన్‌ మల్లీశ్వరి గారి స్వగతాన్ని అచ్చువేశారు. తాను కథ పట్ల ఆసక్తి పెంచుకున్న తీరును ఆమె వివరించారు. తాను ముందుగా కవిత్వాన్ని రాశానని, తదనంతరం వచన ప్రక్రియల పట్ల ఆసక్తి పెంచుకున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా కథ, నవల నిర్మాణంలో తన పాత్ర ఉందంటారు.
           ఈ పుస్తకంలో ఇటీవల ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆవిష్కరించబడిన కొత్త పుస్తకాల ముఖచిత్రాలు 'బహుళ' నవలతో పాటు చిటికెన వేలు, మాయ, అల్పపీడనం, నాలుగు రెక్కల పిట్ట, బాహుదా, చీకటి పువ్వు, దుర్ల, అరసేతిలో బువ్వపువ్వు, నిర్వేదస్థలం, ఆజిరి, బహుళం, విస్మ ృత కళింగాంధ్ర సాహితీ ప్రభ, తరగతి గది స్వప్నం పరిచయం చేసారు. తద్వారా కళింగాంధ్ర కవుల, రచయితల పట్ల మౌళి గౌరవం ప్రదర్శించారు. చందనపల్లి గోపాలరావు గీసిన ముఖచిత్రం బాగుంది. గతంలో రైతు సంఘీభావ సంచికగా 'చర్య' బులిటెన్‌ను ప్రచురించిన మౌళి, నేడు కళింగాంధ్ర సాహిత్య సంచిక 'చంపావతి'ని వెలువరించడం అభినందనీయం.

- పిల్లా తిరుపతిరావు
70951 84846