Sep 22,2022 20:31

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికారంలో ఉన్నన్ని రోజులూ బిసిల సంక్షేమం, అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకే వాడుకున్న చంద్రబాబు నాయుడే నిజమైన బిసిల ద్రోహి అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. బిసిలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు నామినేటెడ్‌ పదవుల్లో మెజార్టీ స్థానాలను కట్టబెట్టి సిఎం జగన్‌ సరైన గుర్తింపునిచ్చారని అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిసిలకు ఏటా రూ.10 వేలకోట్లు ఇస్తామని 2014 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు ఎన్నికోట్లు ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
బిసిలకు ఆత్మగౌరవం పెంచిన జగన్‌ : మంత్రి చెల్లుబోయిన
జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అన్ని అంశాల్లో బిసిలకు అగ్రస్థానం కల్పించి, వారిలో ఆత్మగౌరవాన్ని పెంచారని బిసి సంక్షేమశాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి చెల్లుబోయిన వెంకట వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర కేబినెట్‌లో బిసిలకు అత్యున్నత శాఖలు లేవని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రివర్గంలోని 25 మందిలో 11 మంది బిసిలేనని పేర్కొన్నారు. బిసి వ్యక్తి స్పీకరు స్థానంలో ఉంటే.. టిడిపి సభ్యులు అమర్యాదగా ప్రవర్తిస్తూ అవమానించారని అన్నారు.