Sep 22,2022 15:31

అమరావతి: ''ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులని, యూనివర్సిటికీ ఒకరి పేరు తీసేసి, మరొకరిపేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్‌ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించదు అని సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్‌ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
'టిడిపి హయాంలో ప్రభుత్వ రంగంలో రాష్ట్రంలో ఒక్క వైద్య కళాశాలా నిర్మించలేదు. అయినా సరే అధికారం ఉందంటూ వైద్య విశ్వవిద్యాలయానికి బలవంతంగా వారికి కావాల్సిన పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు దానినే కొనసాగించాలని అడగటం ధర్మమేనా?' అని అసెంబ్లీలో ప్రశ్నించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టిడిపిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లును బుధవారం ఎపి శాసనసభ ఆమోదించింది. ఇదే విషయమై స్పందిస్తూ జూ.ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో టిడిపి నాయకులతో సహా, ఎన్టీఆర్‌ తనయుడు రామకృష్ణ ఎపి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.