Oct 02,2022 20:51

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ :నూతన టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని భవన నిర్మాణాల నిబంధనల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర విపత్తుల, అగ్నిమాపక సేవల శాఖ డిజి ఎం.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆస్పత్రులు, పాఠశాల భవన నిర్మాణాల్లో ఏర్పాట్లపై జిల్లా మెడికల్‌ అసోసియేషన్‌, స్కూల్‌ అసోసియేషన్‌ సభ్యులతో ఆదివారం శ్రీకాకుళంలోని ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాన్ని గుర్తించి నిబంధనలు నిర్దేశించాల్సి ఉందన్నారు. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన భవనానికి రూ.400 విలువ గల ఎంసిబిని తప్పక ఏర్పాటు చేస్తే విద్యుత్‌ ప్రమాదాలను అరికట్టగలమని తెలిపారు. భవనాల్లో మెట్ల మార్గం ఏర్పాటు చేసుకోడం వల్ల ప్రమాదాలను నివారించేందుకు అవకాశముందన్నారు. రెండో ద్వారం చాలా అవసరమని పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తే పెద్ద పెద్ద ప్రమాదాలను అరికట్టగలమని చెప్పారు. ఈ నిబంధనలు పాటించడం వల్ల ఎన్‌ఒసి పొందడం సులభతరమవుతుందని తెలిపారు. పడకల్లేని చిన్న ఆస్పత్రులకు ఎన్‌ఒసి అవసరం లేకున్నా విద్యుత్‌ శాఖ అనుమతులు తప్పనిసరి అన్నారు. సమావేశంలో ఐఎంఎ నాయకులు కె.అమ్మన్నాయుడు, ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్‌, జనార్థనరావు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి జి.శ్రీనివాసులు, జిల్లా ముఖ్య అగ్నిమాపక అధికారి బి.వీరభద్రరావు, సహాయ అగ్నిమాపక అధికారి ఎం.వర ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.