
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అవినీతి రాజకీయాలకు కేంద్రంగా రాష్ట్రం మారిందని, ఇసుక, మైనింగ్, మద్యం అన్నింటిలోనూ అవినీతేనని, సహజ వనరులను దోచుకుని దాచుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వంపై త్వరలో చార్జిషీట్ వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం సోము వీర్రాజు అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ వైఫల్యాలను, మోడీ అభివృద్ధిని ప్రజలకు వివరించే అజెండాతో ప్రజాపోరాటంతో ముందుకు వెళ్లాలన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితమైన మాధవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనసేన బిజెపికి సహకరించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ ప్రకాష్, పురంధేశ్వరి, అరవింద్ మీనన్, సునీల్ దేవదర్, వై.సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.