Mar 22,2023 08:28

తెలుగు వారి సంవత్సరాది ఉగాది. ఇది పూర్తిగా ప్రకృతి సంబంధిత పండగ. అనంతంగా సాగే కాల ప్రవాహంలో చెట్ల ఆకు విడుపు ... కాలానికి ఒక ఆటవిడుపు. మోడు వారిన చెట్టూ చేమా మళ్లీ కొత్తగా, కొంగొత్తగా చివురించి... ఉత్పత్తికి సమాయత్తం కావడం నూతనారంభానికి సంకేతం. ప్రకృతి సూత్రాలను జీవితానికి అన్వయించే సందర్భం ... ఉగాది పర్వదినం! 'శిశిరంలో వాడినా, ఓడినా వసంతం నాటికి కొంగొత్తగా చివుళ్లెత్తే చైతన్యమే జీవితం' అని చాటే ప్రకృతి సందేశం !

Chigurintala-Sandoham-Ugadi-Message

శిశిరంలో ఆకులన్నీ రాలిపోతాయి. చూస్తుండగానే చెట్లు మోడువారిపోతాయి. కొమ్మల మధ్యలోంచి చూస్తే- అంతా శూన్యమే కనిపిస్తుంది. చూపునిండా వెలితి మేఘాలు ఆవరిస్తాయి. కింద రాలిపడిన ఆకులు ఎండిపోయి- గాలివాటుకు ఎటెటో చెల్లాచెదురైపోతాయి. అన్నాళ్లూ కళకళలాడిన చెట్టు వెలవెలపోయినందుకు కలవరపడిపోదు. విలవిల్లాడదు. బోరుమని విలపించదు. నిరాశను కౌగలించుకోదు. నీరసాన్ని నెత్తికెత్తికోదు. రాలిన ఆకుల స్థానే కొత్త చివుళ్లను మొలకెత్తటానికి సమాయత్తమవుతుంది. ఎండలు దండిగా దండెత్తుతున్నా సరే... భూమి పొరల్లోంచి చెమ్మను నెమ్మది నెమ్మదిగా సంగ్రహించి... లేలేత చివుళ్లకు ప్రాణధారగా అందిస్తుంది. అలా అందిన శక్తిని నింపుకొని లేలేత ఆకులు సరికొత్తగా పరవశిస్తాయి. జీవకళతో పరిమళిస్తాయి. మోడువారిన చెట్టు నిండా హరితవర్ణపు పతాకాల్లా ఆకులు రెపరెపలాడతాయి. గుబురు కిరీటాలను ధరించిన ధీరశిఖరంలా చెట్టు నిండుగా, కనువిందుగా కనిపిస్తుంది. అలాంటి గుబురు కొమ్మల్లో దాక్కొని దాక్కొని కోయిల కుహూకుహూ రావాలు చేస్తుంది. అదొక ప్రకృతి సందోహం! 'అంతా అయిపోయింది' అన్న చోట- 'ఇంకా ఎంతో ఉంది' అని చాటి చెప్పే సందర్భం ఈ వసంతం. శూన్యం ఆవరించింది అనుకున్నప్పుడు - అనంతంగా ఆశలు మోహరించే సంకేతం ఈ ఉగాది.
 

                                                            ఆకులు రాలిన చోట...

ఉగాది అచ్చమైన, స్వచ్ఛమైన ప్రకృతి పండగ. తొట్టతొలి కాలంలో ఇప్పుడు ఉన్నన్ని తంతులూ తతంగాలూ లేని పల్లెవాసుల వేడుక. శిశిరమంతా చలిగాలుల వెల్లువ. చైతన్యం సుప్తావస్థలోకి ముడుచుకుపోయే వాతావరణం. పొద్దు వాలగానే చలిపులి దాడి చేస్తుంటే - ఎవరి ముసుగులోకి వాళ్లు దూరిపోయి దాక్కొనే పరిస్థితి! చుట్టూ ఉన్న పరిసరాలు కూడా నిశ్శబ్దాన్ని ఆవహించి, స్తబ్ధుగా నిద్రపోతాయి. వసంతం వచ్చేసరికి అలాంటి వాతావరణం మాయమై - పచ్చని ఆకుల రెపరెపలతో ప్రకృతి గొంతు విప్పుతుంది. మామిడికాయల గుత్తులు, వేపపూల సొగసులూ, చింతబొట్టల కణకణ ధ్వనులూ, చురుగ్గా వీచే చిరుగాలుల అల్లర్లూ ... పరిసరాలకు పరవశం కలిగిస్తాయి. జనావళి మది మూలల్లో సంతోష సరాగాలను తట్టి తట్టి లేపుతాయి. ఆ ఆనందపు సందోహం ఆవరించటం వల్లే- కోయిళ్లు గొంతెత్తుతాయి. కవులు ప్రతిస్పందించి, కవిత్వంగా ప్రతిధ్వనిస్తారు. ఆకులు రాలిన చోట.. ప్రకృతి వసంతగీతం పాడుతుంది.
 

                                                          సేద్యానికి శుభారంభం !

ప్రకృతిలో 'కొత్తొ'చ్చినట్టు కనిపించే సహజ సందడిని ఒక్కోచోట ఒక్కోలా జరుపుకుంటారు. మనది వ్యవసాయ ప్రధానమైన సమాజం కాబట్టి - ఇక్కడి పర్వదినంలో వ్యవసాయ సంబంధ పద్ధతులే కనిపిస్తాయి. ఉగాదిని ఒక కాలమానంగా పెట్టుకొని - వ్యవసాయ ఆరంభానికి రైతులు సన్నద్ధమవుతారు. కొత్తగా కాడినో, మేడినో తయారు చేయించటం; పలుపో, కాడితాళ్లో సిద్ధం చేయడం, పొలాల్లోకి గెత్తం తోలటం, మళ్లలో సాళ్లు వేయటం.. వంటి పనులు చేపడతారు. ఇదంతా వ్యవసాయ పనుల్లోకి ట్రాక్టర్లు రాకముందు సాగిన సాంప్రదాయం. ఇప్పుడు పరిస్థితి మారింది. అయినా, వ్యవసాయ ఆరంభానికి అవసరమైన ఏదో ఒక ప్రక్రియను చేపట్టటం ఆనవాయితీగానే ఉంది. భూమి కౌలు, తనఖా వంటి ఒప్పందాలు ఈ కొత్తామావాస్య కాలంలోనే కుదుర్చుకుంటారు.
 

                                                           పచ్చడిలో జీవిత పరమార్థం !

ఉగాది అనగానే గుర్తొచ్చేది ఆరు రుచుల పచ్చడి. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఇన్ని రుచులు కలగలిసిన తయారీ ఇది తప్ప ఇంకేదీ మనం చవిచూడం. పచనం లేకుండానే ప్రకృతిలో దొరికిన దినుసులను యథాతథంగా వాడడం కూడా ఇందులో ప్రత్యేకం. జీవితంలో కష్టాలూ సుఖాలూ సంతోషాలూ విషాదాలూ కలగలిసి ఉంటాయని ఈ పచ్చడి పరమార్థంగా పెద్దలు చెబుతారు. దీనిని 'జీవితం అంటే ఇంతే' అన్న వేదాంత అర్థంలో కాక - 'జీవితం అంటే ఇవి కూడా' అన్న వ్యవహారిక అర్థంలో తీసుకోవాలి. కష్టకాలంలో కొట్లాడి, పోరాడి దానిని అధిగమించాలి. ద్ణుఖ సమయంలో దానిలో మునిగి, వైరాగ్య గీతాలు పాడుకోకుండా - దాన్నుంచి బయటపడే దారి కోసం అన్వేషించాలి. సుఖసంతోషాలు ఉన్నప్పుడూ అంతే! అవే శాశ్వతమూ సౌఖ్యమూ అన్నట్టు ప్రవర్తించకూడదు. జీవితమంటే - శిశిరంలాంటి ప్రతికూలతతో పోరాడి.. వసంతం వంటి చైతన్యంలోకి ప్రయాణించటం. ముడుచుకున్న ముసుగులోంచి ప్రభవించి.. కొమ్మల్లోని కోయిల పాటలా ప్రవహించటం. అర్థం చేసుకుంటే - ఉగాది తాత్వర్యం ఇదే ! పచ్చడి పరమార్థమూ ఇంతే !!
 

                                                         పర్యావరణ హననం వద్దు

ఇప్పుడు మనం చాలా చిత్రమైన సందర్భాల్లో ఉన్నాం. చెట్లను నరుక్కుంటూ - వసంతం కోసం ఎదురుచూస్తున్నాం. కాంక్రీటు అరణ్యాలు నిర్మించుకుంటూ - కోకిల పాట కోసం చెవులొగ్గుతున్నాం. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ - పచ్చడిలోని ప్రకృతి పరమార్థం గురించి పరవశిస్తున్నాం. వ్యవసాయాన్ని పాడె ఎక్కిస్తూ - రైతే రాజు అని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం అంటే మనమే అని కాదు. మన మౌనాన్ని మద్దతుగా చేసుకొని- మౌలిక వనరులను, పద్ధతులను మింగేస్తున్న ఘనుల గురించే ఈ మాట. ప్రకృతి వనరులను వ్యాపార పరమార్థంగా స్వాహా చేస్తున్న శక్తులూ యుక్తులూ ఈ కాలంలో బాగా పెరిగాయి. ఫలితంగా నదులు కాలుష్యం.. చెట్టు చేమలు అదృశ్యం. పంటపొలాల్లో భవనాల నిర్మాణం.. ఎక్కిన కొమ్మనే నరుక్కుంటున్న తెలివి తక్కువ వ్యవహారం. ఈ పర్యావరణ హననం మీద మనం గట్టిగా పట్టించుకోవాలి. లేకుంటే - భవిష్యత్తులో వేపచెట్టును ఇంటర్నెట్లో వెతుక్కోవాల్సి ఉంటుంది. కోయిల పాటను కంప్యూటర్లోంచి వినాల్సి ఉంటుంది.
 

                                                      పంచాంగం చెప్పని భవిష్యత్తు

ఉగాది పూట మనం తెలుగు భాష గురించి ఘనంగా మాట్లాడుకుంటాం. తెలుగు సంస్క ృతి గురించి గొప్పగా కీర్తించుకుంటాం. ఇది మాత్రమే సరిపోదు ఇప్పుడు. అవసరమైన దానిని నిలబెట్టుకోవటం కోసం నిరంతరం ఆలోచించాలి. పరిష్కార మార్గాలు అన్వేషించాలి. ప్రకృతికి, మనిషికి దూరం పెరగకూడదు. ఎంత పెరిగితే అంత అనర్థం. అలాంటి అనర్థాలకు తావు లేని ప్రతిరోజూ వసంతాల ఉగాది అవుతుంది. పర్యావరణాన్ని హరించే ధోరణులు దారుణంగా పెచ్చుపెరిగితే - ఉగాది కూడా శిశిరంలోనిశీతల చీకటి రాత్రిలాగానే మిగులుతుంది.
మనకు ఏది కావాలో ఏ పంచాంగమూ చెప్పదు.
మనకు మనమే చెప్పుకోవాలి :
'ప్రకృతిని కాపాడుకుంటాం..
మంచి భవిష్యత్తును నిర్మించుకుంటాం.' అని.
- శాంతిమిత్ర