
మీ పిల్లలు ఫోన్ పట్టుకుని విడవట్లేదా? అవి పట్టుకుని అలాగే ఉండిపోతున్నారా? దీని నుంచి వాళ్లను ఎలా బయటపడేయాలో అర్థంకావడం లేదా? అసలు పిల్లలు మొబైల్ లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు? అదే ధ్యాసగా ఎందుకు ఉంటున్నారు? మొబైల్‌తోనే అత్యంత అనుబంధం ఉన్నట్టుగా.. దానిని దూరం చేస్తే ఏదో కోల్పోయినంత ఆవేదన చెందుతున్నారు. పైపెచ్చు గుక్కపెట్టి ఏడుస్తూ.. గగ్గోలు పెట్టేస్తున్నారు. మళ్లీ వారికి ఫోన్ ఇస్తేగానీ శాంతించరు. ఇటీవల ఇద్దరు చిన్నారులు సైతం చనిపోయారు. అంతలా ఫోన్‌లకు ఎడిక్ట్ అవుతున్న పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది.
- కేస్ స్టడీ..
ఐదేళ్ల నితిన్ తల్లిదండ్రులతో కలిసి డీమార్ట్‌కు వెళ్లాడు. పేరేంట్స్ వాడిని ఒకచోట కూర్చోబెట్టి, 'మేము షాపింగ్ చేసొస్తాం.. నువ్వు ఈలోపు మొబైల్ చూస్తూ ఉండే!' అని ఫోన్ చేతిలో పెట్టారు. భలే ఛాన్సు వచ్చిందనుకున్నాడు నితిన్. వెంటనే ఆ మొబైల్ అందుకుని, తల్లిదండ్రులు షాపింగ్ ముగించుకుని వచ్చేవరకూ ఈ లోకంలో లేనంతగా, చుట్టూ ఏం జరుగుతోందో తెలియనంతగా ఆ మొబైల్ ప్రపంచంలో మునిగిపోయాడు. వాళ్లు రావడంతోనే 'ఇప్పటికే చాలా సేపట్నుంచి ఫోన్ చూస్తున్నావు, ఇక చాలు!' అంటూ నితిన్ తండ్రి అతని నుంచి మొబైల్ లాక్కున్నాడు. అంతే నితిన్ వాడిని ఏదో చేసేసినంతగా మాల్ దద్ధరిల్లేలా ఆరున్నొక్క రాగం అందుకున్నాడు. అక్కడే కిందపడిపోయి దొర్లుతున్నాడు. చేతికి దొరికిన వస్తువును దొరికినట్లు విసిరేస్తున్నాడు. వాడి ప్రవర్తనను అందరూ టీవీ సీరియల్ చూసినట్లు మూగిపోయి చూస్తున్నారు.. బిక్కచచ్చిపోయిన తండ్రి వాడికి మళ్లీ సెల్‌ఫోన్ ఇచ్చేశాడు. అంతే గాలిదుమారం ఆగినట్లు అన్పించింది.'' ఇలాంటి సంఘటనలు చాలా మంది ఇళ్లల్లో కనిపించే దృశ్యమే.

- దృష్టి మరల్చాలి..
ఫోన్‌కు వ్యసనంగా మారిన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు పిల్లలకు ఎంత సులభంగా మొబైల్స్ అలవాటు చేస్తారంటే.. తమ పనులకు అడ్డం రాకూడదనో.. మాట వినకపోతేనో.. అడిగింది కొనకుండా మరిపించడానికో.. వాళ్ల చేతిలో ఫోన్ పెట్టేస్తారు. దీంతో ఆ పిల్లలు అవసరమున్నా లేకున్నా.. ఆ ఫోన్‌కు ఎడిక్ట్ అయిపోయి, తల్లిదండ్రుల దగ్గర నుంచి దాన్ని ఎలా పొందాలో తెలుసుకుని.. ప్రయోగిస్తూ ఉంటారు. ఫోనుకు ఎడిక్ట్ అయిపోయిన పిల్లల్లో ఇది తీవ్రమైన మనోవ్యాకులత కలిగిస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. పిల్లలకు ఇలా ఫోన్లు అలవాటు చేయడం ప్రమాదకరం. ఇలాంటి పరిస్థితుల్లో మొదట పిల్లలను ఆకట్టుకునే ఆటలూ, కథలూ, బాలగేయాలు నేర్పే యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసి, వారిని అవి చూసేలా ప్రోత్సహించాలి. తర్వాత్తర్వాత వారికి ప్రయోజనకరమైన విషయాలుండేలా చూడాలి. వాటిల్లో చూపించే మంచి అలవాట్లు మనమూ పాటిద్దాం అంటూ తల్లిదండ్రులు తాము అనుసరిస్తూ పిల్లలకి నేర్పాలి. ఆ తర్వాత రోజులో గంటసేపే ఫోన్ వాడాలనే నిబంధన పెట్టాలి. ఫోన్ ఇచ్చి, ఊరుకోకూడదు. వాళ్లు ఏమేమి చూస్తున్నారో పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి. హింసాత్మకమైనవి, అశ్లీలమైనవి వాళ్ల కంటపడకుండా చైల్డ్ లాక్ సిస్టమ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ చూస్తున్నట్లు గమనించగానే దాన్ని నియంత్రించాలి.
- సెలవుల్లో ప్రణాళిక..
పిల్లలను సాధ్యమైనంత వరకు బయటకు తీసుకెళ్లే ప్రణాళికలు వేయాలి. ఇరుగుపొరుగు పిల్లలతో, చుట్టాల పిల్లలతో, కుటుంబంలోని ఇతర పిల్లలతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలి. ప్రతి కాలనీలో కమ్యూనిటీ పార్కులు ఉంటాయి. వాటిల్లో ఆటల సామగ్రి ఉంటే సరి, లేకపోతే ఆ కమ్యూనిటీలో ఉన్నవాళ్లందరూ మీట్ అయ్యి, కొన్ని ఆట వస్తువులు సమకూర్చుకోవాలి. పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లి ఆడించాలి. పట్టణ ప్రాంతాల్లో పిల్లలు ఆడుకునేందుకు పార్కులు అందుబాటులో ఉంటాయి. వీటిని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఫోన్లు వాడే పిల్లల్ని ఇలాంటి యాక్టివిటీల్లో బిజీ చేయాలి. జూపార్క్‌లు, మ్యూజియమ్స్, స్విమ్మింగ్ వంటి వాటితో, పర్యాటక ప్రాంతాలకు కూడా తీసికెళ్లాలి.
- తల్లిదండ్రులదే బాధ్యత..
ప్రస్తుత జీవన విధానంలో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తక్కువైపోయింది. ఇంట్లో ఉన్న సమయంలో వేరే వ్యాపకాల్లో పడిపోయి, పిల్లలకి ఫోనులిచ్చేసే వారే ఎక్కువగా ఉన్నారు. అదీ కాకుండా పిల్లలను దేనినుంచైనా మైమరిపించే మంత్రం ఫోన్ ఒక్కటే అని వాళ్లకు ఫోన్ ఇచ్చెయ్యడం సర్వసాధారణమైపోయింది. ఇది చాలా ప్రమాదకరం. పిల్లలు తమ చుట్టూ ఉన్న వస్తువులకు, పరిస్థితులకు అలవాటు పడాలి. అప్పుడే వాళ్ల మెదడు సహజంగా అభివృద్ధి చెందుతుంది. పిల్లలకి బుద్ధులు చెబుతూ పెద్దలు పాటించకపోతే.. వారి మాట పిల్లలు కూడా లక్ష్యపెట్టరు. అందుకే పెద్దలు ఎక్కువసేపు ఫోన్‌లో గడపొద్దు. ఇంట్లో ఉన్న కాసేపు పిల్లలతో గడపకుండా ఫోనుల్లో మునిగిపోతే, పిల్లలూ వారినే అనుసరిస్తారు. ఫోనుకు అలవాటు పడటం వల్ల, తమ చుట్టూ ఉన్న వారితో మాట్లాడటం, సంభాషణలు వినడం, భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవడం వంటి వాటిల్లో వెనకబడిపోతారు. ఫలితంగా అవి తర్వాత్తర్వాత సమస్యాత్మకంగా అయ్యే ప్రమాదం ఉందంటున్నారు మానసిక నిపుణులు.
- చిన్న జీవితాలు భద్రం..
ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల పిల్లల్లో ఆటిజం వంటి సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ చిన్నారి ఏడుస్తుందని పేరేంట్స్ ఆమెకు సెల్‌ఫోన్ ఇస్తే ఆడుకుంటుండగా మొబైల్ పేలి ఆ బాలిక చనిపోయింది. పిల్లల ఎదుగుదలలో తొలి రెండు నుంచి నాలుగేళ్లు చాలా కీలకం. వాళ్ల మెదడు వేగంగా వికసించే వయసు కూడా ఇది. తల్లిదండ్రులు చెప్పే మాటలు విని ఊకొట్టి, వాళ్లని అనుసరించే అన్నీ నేర్చుకుంటారు. పిల్లలు ఆట వస్తువుల్ని తడిమి చూసే స్పర్శజ్ఞానం తెలుసుకుంటారు. బయట పిల్లలతో కలిసి ఆటలాడటం ద్వారా వ్యక్తీకరణ, ఎమోషన్స్ నేర్చుకుంటారు. సహజమైన ఎదుగుదలకు ఫోన్లు పెద్ద ఆటంకంగా మారుతున్నాయి. పిల్లల్ని పూర్తిగా వశపరచుకుని, కదలనివ్వకుండా చేస్తున్నాయి.

- భవిష్యత్తుకు అండగా..
ఫోన్ వాడుతున్న చిన్నారులు ఎక్కువగా కార్టూన్స్, చిన్నపిల్లల యాక్టివిటీస్ చూస్తుంటారు. వారికి అవే చాలా అబ్బురంగా అనిపిస్తాయి. ఇటీవల వాటిల్లోనూ క్రైమ్ మోతాదు పెంచి చూపిస్తున్నారు. అవి తప్ప మరేవీ ఆసక్తిగా కనిపించవు. పది నిమిషాల కంటే ఎక్కువ దేనిపైనా శ్రద్ధ పెట్టలేకుండా అయిపోతారు. దీనిని అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అని నిపుణులు చెప్తున్న మాట. అయితే ఈ నేరం కచ్చితంగా తల్లిదండ్రులదే అనీ నిపుణులు అంటున్నారు. పిల్లల్ని సాంకేతిక పరికరాలకు అతుక్కుపోయేలా చేస్తున్నది తల్లిదండ్రులే అని చెప్తున్నారు. పిల్లలకు మంచిచెడ్డలు నేర్పే ఓర్పు లేకుండా, పేరెంట్స్ చాలామంది ఫోన్లు ఇచ్చేస్తున్నారు. కొంచెం పెద్దపిల్లల విషయంలో పర్యవేక్షణ లేకపోతే.. సోషల్ మీడియా, ఆన్‌లైన్‌లో ఉండే సమయంలో ఏం చూస్తున్నారో, ఎవరితో కాంటాక్టులోకి వెళుతున్నారో తెలుసుకోకపోతే ట్రాక్ తప్పేస్తారు. మీరు దగ్గరకు వెళ్లినప్పుడు కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ మార్చుతున్నారంటే,. ఏదో చూడకూడనిది చూస్తున్నట్లే అర్థం. పిల్లల మొబైల్‌లో కొత్త ఫోన్ నెంబర్లు, ఈమెయిల్స్ ఉంటే పరిశీలించాలి. ఇంటర్నెట్ వినియోగించాక పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో గమనించుకోవాలి. వీటితో కలిగే లాభనష్టాలు పిల్లలకు వివరించాలి.
రాత్రి వేళ ఎక్కువ సేపు మేల్కొని ఫోన్ల నుంచి వచ్చే లేత నీలి వెలుగుతో నిద్ర కోల్పోతున్నారు. ఈ నిద్రలేమితో చిన్నప్పుడే తీవ్ర అనారోగ్యానికి గురై, ఏకాగ్రతను కోల్పోతున్నారు. అత్యంత చిన్న వయసులోనే తీవ్ర ఉద్వేగాలకు లోనుకావడం ఫోన్‌ల వల్లే అని మానసిక నిపుణులు చెప్తున్న మాట. విపరీతమైన కోపం రావడం, ఏదైనా గట్టిగా చెప్పినప్పుడు నరాలన్నీ బిగబెట్టి, కళ్లు పెద్దవి చేసెయ్యడం.. ఇవన్నీ ఆ లక్షణాలే. తర్వాతర్వాత వీళ్లు సమస్యాత్మక వ్యక్తులుగా మారే ప్రమాదం ఉంది. అందుకే ముందుగా మారాల్సింది తల్లిదండ్రులే. మనమెలా మార్గదర్శనం చేస్తే వాళ్లు అలా ముందుకెళ్తారు. ఏదైనా శారీరక, మానసిక వ్యాయామాన్ని ఇచ్చే ఆటల్లో వాళ్లను ప్రోత్సహించండి. అందుకే పిల్లల్ని ఫోన్లకు దూరంగా ఉంచి, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఎదగనిద్దాం..