
- నిలిచిపోయిన వాహనాలు
- మూతపడిన వాణిజ్య సముదాయాలు
- అమర్ రాజా బస్సు అద్దాలను పగలగొట్టిన వైసిపి నేతలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ : చిత్తూరు జిల్లాలో వైసిపి నాయకులు చేపట్టిన బంద్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. పుంగనూరులో హింసకు కారణం తెలుగుదేశం పార్టీయేనని ఆరోపిస్తూ ఉదయం ఆరు గంటలకే వైసిపి శ్రేణులు భారీగా చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని నల్లకండువాలతో నిరసన తెలిపాయి. బంద్ సందర్భంగా బస్సులు, భారీ వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. వైసిపి నాయకులు, కార్యకర్తలు ద్విచక్రవాహనాల్లో నగరంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అమర్ రాజా బ్యాటరీస్‌కు చెందిన బస్సును అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కొంగారెడ్డి పల్ల వద్ద అడ్డుకొని అందులోని సిబ్బందిని కిందకు దింపేశారు. బస్సు అద్దాలు పగుల గొట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శించారు. నగరంలో పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా చిత్తూరు డిఎస్‌పి శ్రీనివాసమూర్తి నేతృత్వంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ నేపథ్యంలో పుంగనూరులో ఆర్‌టిసి బస్సులను డిపోలోనే నిలిచిపోయాయి. కుప్పంలో వైసిపి నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ఆర్‌టిసి బస్సులు, ప్రయివేట్ ఆటోలను ధ్వంసం చేశారు. పలమనేరులో ఎమ్మెల్యే వెంకటగౌడ బంద్‌లో పాల్గొన్నారు. గంగవరంలో వైసిపి కార్యకర్తలు రహదారులపైకి వచ్చి నిరసన తెలిపారు. వి.కోట, వెదురుకుప్పం, బంగారుపాళ్యంలో ర్యాలీ చేశారు. బైరెడ్డిపల్లిలో వైసిపి రాష్ట్ర కన్వీనర్ మొగసాల కష్ణమూర్తి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వైసిపి కార్యకర్తలు బైఠాయించి ధర్నా నిర్వహించారు. గుడిపాల, జీడినెల్లూరు, పూతలపట్టు, ఐరాల, యాదమరి, తవణంపల్లిలో బంద్ ప్రశాంతంగా సాగింది.